టెన్త్‌ ఫీజు చెల్లింపు గడువు 2 వరకు పెంపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదోతరగతి పరీక్షలు-2024 మార్చిలో హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లింపు గడువును వచ్చేనెల రెండో తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.50తో వచ్చేనెల 12 వరకు, రూ.200తో అదేనెల 21 వరకు, రూ.500తో వచ్చే ఏడాది జనవరి మూడో తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. ఆయా తేదీల్లో సాధారణ సెలవులుంటే మరుసటి రోజు ఫీజు చెల్లించొచ్చని సూచించారు. విద్యార్థులు ఇతర సమాచారం కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. వచ్చేఏడాది మార్చిలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.