– 19 కేంద్రాల్లో 11 వరకు నిర్వహణ
– ఈ నెలాఖరులో ఫలితాలు!
– నేటితో ముగియనున్న పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యు యేషన్) ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలు గతనెల 18 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. గతనెల 30వ తేదీతో ప్రధాన పరీక్షలు ముగిశాయి. మంగళవారంతో మిగిలిన పరీక్షలు పూర్తవుతాయి. బుధవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ జరుగుతుంది. 18 జిల్లాల్లో 19 మూల్యాంకన కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రెండు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలున్నాయి. ఈనెలాఖరులో లేదంటే వచ్చేనెల మొదటి వారంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
టెన్త్ పరీక్షకు 98.30 శాతం హాజరు
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం ఎనిమిదో రోజు ఒకేషనల్, ఓఎస్‌ఎస్‌సీ పేపర్-1 పరీక్షను నిర్వహించామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 37,892 మంది దరఖాస్తు చేస్తే, 37,247 (98.30 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. 645 (1.70 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు. ప్రయివేటు విద్యార్థుల్లో 91 మంది దరఖాస్తు చేసుకుంటే, 87 (95.60 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. నలుగురు (4.40 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఎనిమిదో రోజు ఒక్క విద్యార్థిపైనా మాల్‌ప్రాక్టీస్ కేసులను నమోదు చేయలేదని తెలిపారు. ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. మంగళవారంతో పదో తరగతి పరీక్షలు ముగుస్తాయి.