150 మంది అవుట్‌ సోర్సింగ్‌ నర్సింగ్‌ ఆఫీసర్ల తొలగింపు

150 మంది అవుట్‌ సోర్సింగ్‌ నర్సింగ్‌ ఆఫీసర్ల తొలగింపు– వారిని యధావిధిగా కొనసాగించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇటీవల రెగ్యులర్‌ నర్సింగ్‌ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ నర్సింగ్‌ ఆఫీసర్లను తొలగించింది. తాజాగా సిద్ధిపేట మెడికల్‌ కాలేజీలో దాదాపు వంద మంది, మహబూబ్‌ నగర్‌ నర్సింగ్‌ కాలేజీలో దాదాపు 50 మందిని తొలగించడంతో వారిలో ఆందోళన నెలకొంది. దీంతో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, సిద్ధిపేట జిల్లా సీఐటీయూ నాయకులు రవితో కలిసి ఉద్యోగాలు కోల్పోయిన నర్సింగ్‌ ఆఫీసర్లు మంగళవారం హైదరాబాద్‌ కోఠిలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, తదితర ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, నర్సింగ్‌ ఆఫీసర్లు మాట్లాడుతూ కోవిడ్‌ కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేశామని గుర్తుచేశారు. రెగ్యులర్‌ నర్సింగ్‌ ఆఫీసర్ల స్థానంలో ఇంతకాలం పని చేసిన వారిన తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.ఐదేండ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యారోగ్యశాఖలోని ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికి ఉద్యోగ భద్రత కల్పించి యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.