ఉగ్రరాజ్యాలు – అమానుష యుద్ధాలు

Terrorism - Inhuman warsప్రపంచంలో రెండు ప్రమాదకర పిచ్చిపనులు ఉన్నాయి. 1. యుద్ధాలు చేయడం. 2. ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం. ఎంతటి దేశాధినేతలైనా ఈ దుర్మార్గ చర్యలకు పాల్పడితే వారిని పిచ్చినేతలని భావించడంలో ఆభ్యంతరం ఏ ముంటుంది? అయితే ప్రతి మనిషి – మనం ఈ పిచ్చిపనులకు పరోక్షంగా కారకులం కాదుకదా? అనే విచక్షణ కలిగి ఉండాలి. లేకుంటే వీటిని నివారించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఎంతకాదనుకున్నా ఈ రెండు మానవ వైపరీత్యాల పట్ల ఉదాసీనత కలిగి ఉండటం అంటే మానవాళి తమ వేళ్ళతో తమ కళ్ళు పొడుచుకునేటట్టు ఆత్మహత్యా సదృశ్యంలోకి జారుకుంటున్నట్టు లెక్క.
అమెరికా వైమానిక సైనికదళ అధికారి ఆరోస్‌బుష్నేర్‌ ఇటీవల ఆత్మాహుతి చేసుకునే ముందు ఫేస్‌బుక్‌లో ఒక సందేశాన్ని పంపాడు.
ఇజ్రాయిల్‌, గాజాపై చేస్తున్న యుద్ధుదాడికి తట్టుకోలేక ఆ అధికారి ”కళ్ళెదుట మారణహోమం సాగుతుంటే ప్రపంచం నిర్లిప్తంగా మిగిలిపోవడాన్ని, తన చేతులు రక్తసిక్తం కావడాన్ని చూసి తట్టుకోలేక పోతున్నానని”, అందుకే నా ఈ ఆత్మహననం” అని ఆ సందేశంలో పేర్కొన్నాడు. వైరల్‌ అవుతున్న ఈ సందేశం పట్ల యావత్‌ ప్రపంచం కలత చెందుతున్నది. అయినా అమెరికా ప్రభుత్వానికి సిగ్గూ ఎగ్గూ లేకుండా పోయింది. చీమకుట్టినట్టు కూడా స్పందించలేదు.
ఇటీవల ఇజ్రాయిల్‌, లెబనాన్‌ సిరియాలో పేజర్లు, వాకీటాకీల ద్వారా పేలుళ్ళు సంభవించేటట్లు చేసింది. అటు సైనిక పటాలాన్నే కాక ఇటు పౌరసమాజాన్ని కూడా కకావికలం చేసింది.
ఆ పేలుళ్ళకు 37 మంది మరణిస్తే నాలుగువేల మంది క్షతగాత్రులయ్యారు. ఇదేమి యుద్ధనీతి? అని లోకం కోడై ప్రశ్నిస్తున్నా అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాద పాలకులు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనడం లేదు.
లెబనాన్‌లో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మిలిటెంట్లను ఏరిపారేయడానికే తామీ చర్యలకు పాల్పడినట్టు ఇజ్రాయిల్‌ చెప్పుకుంటున్నది. మరి ఉగ్రవాదులతో పాటు ఆ దాడులకు పసిపిల్లలు, అమాయక పౌరులు, ఆరోగ్య కార్యకర్తలు బలై పోవడాన్ని ఏమనాలి? దానికి సమాధానం ఉండదు.
ఉగ్రవాదం ఎప్పుడూ ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ ఉంటుంది. నిజమే కానీ ఓ రాజ్యం (ప్రభుత్వం) కూడా ఉగ్రవాద స్థాయిలో విచక్షణ మరచి రగిలిపోతే ఎలా? అసలు ఆ మాటకొస్తే ‘హిజ్బుల్లా’ ఆ దేశ ప్రజల దృష్టిలో కేవలం ఓ ఉగ్రవాద సంస్థే కాదు అదో రాజకీయ పక్షం, ధార్మిక సంస్థ కూడా. కనుకనే ఆ పేజర్లు స్థానిక పౌరుల చేతులకూ చేరాయి.
కొన్ని రాజ్యాల్లో పేరుకు పోతున్న ఈ విద్వేష ఉన్మాదం ప్రజాస్వామ్యవాదులకు ఎప్పుడూ మింగుడు పడదు. దీన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించకపోతే రక్తం రుచి మరిగిన తోడేళ్ళ గుంపుల్లాగా ఉగ్రరాజ్యాలు పెట్రేగి పోతాయి. ఉగ్రరాజ్యాలు ఎప్పుడూ తమ దేశంలోని ప్రజల కనీస ప్రజాస్వామ్య విలువలకు వీసమెత్తు విలువ నీయవు. వివక్షపూరితంగానే వ్యవహరిస్తాయి. అసమానతలను పెంచి పోషిస్తాయి.
గత ఏడాదిగా ఇజ్రాయిల్‌ పాలస్తీనా ప్రజలపై సాగిస్తున్న యుద్ధదాడికి ఒక పరిష్కారదిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఎప్పటి కప్పుడు అడ్డు తగిలేది ఇజ్రాయిల్‌ ప్రభుత్వం. దానికి పూర్తిగా వంత పాడేది అమెరికా ప్రభుత్వం. ఇరుగు పొరుగున ఉండే చిన్న చిన్న దేశాల్లో, అలాగే లాటిన్‌ అమెరికా దేశాల్లోని నియంతలకు ఆయుధాలిచ్చి ప్రజలపై ఉసిగొల్పే చరిత్ర ఇటు ఇజ్రాయిల్‌కి ఉన్నది. అటు అమెరికాకు ఉన్నది. చూస్తూ ఉంటే మేస్తూ పోయే తంతులా ఈ ఉగ్రరాజ్యాల వ్యవహారం నడుస్తున్నది.
ఇది ఇలా ఉండగా ఇక్కడ మన మోడీ ప్రభుత్వం గురించి కూడా చెప్పుకోవాలి. పాలస్తీనా ప్రజలకు భారత మద్దతు ఉంటుందని మోడీ ఆ పాలస్తీనా నేత అబ్బాస్‌తోనే పైకి చెప్పాడు. కానీ ఆచరణలో పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ ఆక్రమించిన ప్రాంతాల నుండి ఖాళీ చేయాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానంపై ఓటు వేయకుండా గైర్హాజరు అవుతారు. అంటే పరోక్షంగా ఆ ఉగ్రరాజ్యాలకే కొమ్ము కాస్తున్నట్టు తెలుస్తున్నది.
మొత్తం మూడువేలకు పైగా పేజర్లులో, పేజర్‌ సర్క్యూట్‌తో సంబంధంలేని ఓ మైక్రోచిప్‌ కన్పించిందని, దానిలోనే పేలుడు పదార్థం ఉన్నట్టు గుర్తించామని, దానిని బట్టి ఇది మాపై జరిపిన దీర్ఘకాలిక వ్యూహాత్మక కుట్రగా భావిస్తున్నామని హిజ్బుల్లా పేర్కొంది. ప్రతీకారచర్యగా వందరాకెట్లను ప్రయోగించింది. తత్‌ ఫలితంగా ఇజ్రాయిల్‌-హిజ్బుల్లా పూర్తిస్థాయి యుద్ధంగా మారడంతో పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. తాజాగా ఇజ్రాయిల్‌ భీకరస్థాయిలో లెబనాన్‌పై దాడులు చేయడంతో 558 మంది మరిణించారు. వేయిమందికి పైగా గాయపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే పశ్చిమాసియాను ఇజ్రాయిల్‌ నిప్పుల కొలిమిగా మార్చింది.
అందువల్ల ఈ ఉగ్రరాజ్యాలు – అమానుష యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచమంతటా విస్తారంగా ప్రచారం సాగాలి. విశ్వశాంతి ఉద్యమం వెల్లివిరియాలి. పర్యావరణ పరిరక్షణ పాఠశాల విద్యార్థులకు ఎలా పాఠ్యాంశాలుగా రూపొందుతున్నయో, విశ్వశాంతి పాఠాలు కూడా చిన్నప్పటి నుండే బాలలు తెలుసుకోవాలి. లేకుంటే మన భావితరం ఆ పిచ్చి ఉన్నాదుల వలలో నిత్యం చిక్కుకుంటూనే ఉంటుంది.
– కె.శాంతారావు, 9959745723