– భారత మార్కెట్‌పై ఎలన్ మస్క్ గురి
న్యూఢిల్లీ : భారత మార్కెట్‌పై కన్నేసిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇక్కడ వ్యాపార విస్తరణ కోసం ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్‌తో జట్టు కట్టనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇరు సంస్థల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. రిలయన్స్ భాగస్వామ్యంలో దేశంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రిపోర్టులు వస్తోన్నాయి. ఇందుకోసం ఇరు సంస్థలు కలిసి ఒక్క సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మందుకు వచ్చాయని హిందూ బిజినెస్ లైన్ ఓ కథనం ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం.. దాదాపు నెల రోజులుగా రిలయన్స్‌తో టెస్లా ప్రతినిధులు చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. విద్యుత్ వాహనాల తయారీ, అమ్మకాలు సహా ఇతర అనుబంధ సేవలను రిలయన్స్ సమకూర్చనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అత్యధిక జనాభా గల దేశాల్లో ఇవి కార్ల వినియోగం అవసరమని ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఈ వార్తలు రావడం విశేషం.
భారత్‌లో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం సమకూర్చడానికి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు పలు ప్రతిపాదనలను టెస్లా ప్రతినిధుల ముందు ఉంచారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చలు కొనసాగుతున్నటు తెలుస్తోంది. దాదాపు 2-3 బిలియన్ డాలర్ల (రూ.8-16వేల కోట్లు) వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కాగా.. కుడివైపు స్టీరింగ్ ఉండే కార్ల తయారీని జర్మనీలో ఉన్న టెస్లా ప్లాంట్‌లో ప్రారంభించినట్లు ఇటీవల రాయిటర్స్ తెలిపింది. వాటినే భారత మార్కెట్‌లోకి ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
త్వరలోనే మోడీతో మస్క్ భేటీ..
భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22న ప్రధాని మోడీతో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత టెస్లా కార్ల తయారీ ప్లాంట్, పెట్టుబడులపై ప్రకటన ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ డిమాండ్ చేసినట్లుగా ఇటీవల మోడీ సర్కార్ విద్యుత్ వాహనాల (ఇవి) పాలసీని ప్రకటించింది. ఇవిలపై అమాంతం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దేశంలో ఏదైనా కంపెనీ కనీసం రూ.4,150 కోట్లు పెట్టుబడిగా పెడితే చాలు పలు రాయితీలు పొందవచ్చు. ఈ రెండు ప్రధానాంశాలు కూడా టెస్లాను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు స్పష్టమవుతోంది. కొత్త పాలసీ ప్రకారం.. ఇవి కంపెనీలు 35 వేల డాలర్ల (రూ.29లక్షలు) కంటే అధిక ధర కలిగిన కార్లను 15 శాతం సుంకంతో ఏటా 8,000 ఇవి కార్ల వరకు దిగుమతి చేసుకోవడానికి ఇవి పాలసీ అనుమతిస్తుంది. ప్రస్తుతం కార్ల ధరను బట్టి 70-100 శాతం వరకు దిగుమతి సుంకాలు అమల్లో ఉన్నాయి. భారత్‌లో ఎన్నికల వేళ టెస్లాకు అనుకూల విధానాలు చేపట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.