– అష్టదిగ్బంధంలో దేశ రాజధాని
– బారికేడ్లు, సిమెంట్ దిమ్మలతో పోలీసులు అడ్డుకునే యత్నం
– రోడ్లపై ఇనుప మేకులు..సరిహద్దులు మూసివేత
– భారీగా బలగాల మోహరింపు
– ఉద్రిక్తంగా ‘ఢిల్లీ చలో’
న్యూఢిల్లీ : అన్నదాతల ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతలకు దారితీసింది. పలు చోట్ల పోలీసుల కన్నుగప్పిన రైతులు బారికేడ్లను ఛేదించుకొని రాజధానిలో ప్రవేశించారు. మరోవైపు వారిని చెదరగొట్టేందుకు పోలీసులు నీటి ఫిరంగులు, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ముఖ్యంగా హర్యానా-పంజాబ్ సరిహద్దులోనూ, రాజధానిలో ప్రవేశించే ప్రాంతాల్లోనూ యుద్ధ వాతావరణం కన్పించింది. అంబాలాలోని షంభూ సరిహద్దు వద్ద బారికేడ్లను తోసుకొని ఢిల్లీ వైపు దూసుకెళుతున్న యువకులపై పోలీసులు భాష్పవాయు గోళాలను విసిరారు. కొందరు రైతులను అడ్డుకొని నిర్బంధించారు. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో పోలీసులు, పారా మిలటరీ దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి. అల్లర్లను అదుపు చేయడానికి వాహనాలను సిద్ధంగా ఉంచారు. భద్రతా వలయాన్ని ఛేదించుకొని పంజాబ్ నుంచి రాజధానికి వస్తున్న రైతులపై హర్యానాలోని జింద్ జిల్లాలో పోలీసులు జులు ప్రదర్శించారు. ఖన్నౌరీ సరిహద్దు మీదుగా హర్యానాలో ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించిన రైతన్నలపై భాష్పవాయు గోళాలు విసిరారు. నీటి ఫిరంగులను ప్రయోగించారు. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనేక చోట్ల వివిధ అంచెల్లో బారికేడ్లను, సిమెంట్ దిమ్మలను, కంటెయినర్ గోడలను ఏర్పాటు చేశారు. రైతులు తిరగకుండా రోడ్లపై ఇనుప మేకులను అమర్చారు. ఎర్రకోట వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. సోమవారం రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత దీనిని మూసివేశారు. ఎర్రకోటను చేరుకునే ఓఆర్‌ఆర్‌పై బారికేడ్లను అమర్చారు. ఢిల్లీ వైపు వస్తున్న రైతులు షంభూ (హర్యానా-పంజాబ్) సరిహద్దు వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు. మరోవైపు తిక్రి సరిహద్దును ఢిల్లీ పోలీసులు మూసివేశారు. అక్కడ ఐదు మీటర్ల పొడవైన సిమెంటు దిమ్మలతో బహుళ అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. తిక్రి మెట్రో స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిని కలిపే వీధులు, గ్రామాలకు రాకపోకలను నిషేధించారు. తిక్రి సరిహద్దు వద్ద మూడు మహిళా కంపెనీలు సహా పెద్ద ఎత్తున పోలీసు దళాలను మోహరించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద రాజస్థాన్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. మూడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేసింది.
కేంద్రం విజ్ఞప్తికి ‘నో’
అరెస్ట్ చేసిన రైతులను నిర్బంధించేందుకు బావనా స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చాలంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ప్రభుత్వం తోసిపుచ్చింది. రైతుల డిమాండ్లు సమంజసమైనవేనని, వారిని అరెస్ట్ చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
హడావిడిగా చట్టం చేయడం కుదరదు : కేంద్రం
కనీస మద్దతు ధరలపై హడావిడిగా చట్టాన్ని చేయడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా అన్నారు. దీనిపై అందరు భాగస్వాములతో చర్చించాల్సిన అవసరం ఉన్నదని, ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రైతులు ముందుకు రావాలని ఆయన చెప్పారు. కొన్ని శక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళనను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రెండు దఫాలుగా జరిపిన చర్చల్లో అనేక డిమాండ్లను అంగీకరించామని, అయితే కొన్ని అంశాలపై అంగీకారం కుదరలేదని తెలిపారు.
”న్యూ ఇండియాలో టెక్నాలజీ వల్ల అన్నదాతలు ధనవంతులౌతున్నారు”
– ఇది బీజేపీ వారి ట్వీట్!
సాక్ష్యం ఇదిగో ప్రధాని పక్కనే ఎగురుతున్న కిసాన్ డ్రోన్ ఫొటో కాని మంగళవారం దృశ్యం వేరే! రైతులపై భాష్ఫవాయువు గోళాలు వేస్తున్నది డ్రోన్లతోనే…
– సిద్ధార్థ వరదరాజన్, ది వైర్ పోర్టల్
అధికారంలోకి వస్తే ఎంఎస్‌పీపై చట్టం : రాహుల్‌తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు కనీస మద్దతు ధర అందించేందుకు చట్టాన్ని తీసుకొస్తా మని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇది న్యాయం దిశగా తాము అందిస్తున్న తొలి గ్యారంటీ అని తెలిపారు. దీని ద్వారా పదిహేను కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వివరించారు. రైతుల న్యాయమైన డిమాండ్‌ను అంగీకరించాల్సింది పోయి బీజేపీ ప్రభుత్వం వారిపై భాష్ప వాయువును ప్రయోగిస్తోం దని, జైళ్లలో కుక్కు తోందని ఆరోపిం చారు. కాగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న రైతు సంఘాల నాయకుల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారని, దీనివల్లే ప్రతిష్టంభన ఏర్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. రైతులతో ప్రధాని మోడీ నేరుగా చర్చలు జరపాలని డిమాండ్ చేసింది.
మొండి వైఖరి
ప్రమాదకరం : బీకేయూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి ప్రమాదకరంగా ఉన్నదని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ తికాయత్ విమర్శించారు. ‘వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు డిమాండ్లు ఉన్నాయి. రైతులు నిరంతరం నిరసనలు తెలుపు తారా? వారు ఎప్పుడూ ఢిల్లీ వస్తారా?’ అని ప్రశ్నించారు.