– రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
– జూన్, డిసెంబర్‌లో నిర్వహణ
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఇకనుంచి ఏటా రెండుసార్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్, డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009 మార్గదర్శకాలను సవరిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి 2015, డిసెంబర్ 23న మార్గదర్శకాలను జారీ చేసిందని పేర్కొన్నారు. వాటిని పరిశీలించి తాజాగా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. గతంలో ఏటా ఏప్రిల్ లేదా మేలో టెట్ నిర్వహించాలన్న నిబంధనను సవరించామని తెలిపారు. ఇప్పుడు రెండు సార్లు జూన్, డిసెంబర్‌లో టెట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎన్ని సార్లయినా టెట్ రాసుకోవచ్చనీ, ఎలాంటి ఆంక్షల్లేవని వివరించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, టెట్ చైర్‌పర్సన్, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీంతో ఇకనుంచి డీఎస్సీ నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఏటా రెండుసార్లు టెట్‌ను విద్యాశాఖ నిర్వహించనుంది. టెట్ గడువును ఏడేండ్ల నుంచి జీవిత కాలానికి పొడిగించిన విషయం తెలిసిందే. టెట్ ఉత్తీర్ణులైతే ఆ అభ్యర్థులకు జీవితకాలం వారి అర్హతను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే డీఎస్సీ రాతపరీక్షలకు 80 మార్కులు, టెట్‌కు 20 మార్కులు కలిపి వంద మార్కులుగా పరిగణిస్తారు. ఇంకోవైపు ప్రయివేటు పాఠశాలల్లో బోధిం చాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అందుకే టెట్‌కు ప్రాధాన్యత ఉంటుంది.