ప్రభుత్వం కోరితే టెట్‌ మినహాయింపునిస్తాం

ప్రభుత్వం కోరితే టెట్‌ మినహాయింపునిస్తాం– పీఆర్టీయూటీఎస్‌ నేతలకు ఎన్‌సీటీఈ చైర్మెన్‌ హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2010 కన్నా ముందు నియామకమై ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి పదోన్నతి పొందాలంటే టెట్‌ ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ కోరితే పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేస్తామంటూ పీఆర్టీయూటీఎస్‌ నేతలకు ఎన్‌సీటీఈ చైర్మెన్‌ యోగేంద్ర సింగ్‌ హామీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలో యోగేంద్ర సింగ్‌ను పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు అదే స్థాయిలో పదోన్నతి పొందాలంటే టెట్‌ ఉత్తీర్ణత అవసరం లేదన్నారని తెలిపారు. ఇన్‌సర్వీసు ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి టెట్‌ విషయమై విద్యాహక్కు చట్టంలోని మార్గదర్శకాలను సవరించే విషయమై పరిశీలిస్తామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.