మనుషులకు అంకితంగా ఈ వచన పద్యాల సంపుటి ‘శతద్రు’ అందించారు డా||గండ్ర లక్ష్మణరావు. ఈ వచన పద్యాల సంపుటిలో మొత్తం 79 కవితలున్నాయి. వాటిలో 5 ఎలిజీలు, 14 ఎక్స్ ప్రశ్నలు, 60 (వచన) పద్యాలున్నాయి. ఎక్స్‌ప్రశ్నలలో ఒకదానిపై లఘుచిత్రాన్ని జర్నలిస్ట్ నగునూరి శేఖర్ నిర్మించారు.
‘అమృతానికి ఆమ్రేడితం కవిత్వం అన్నారు పెద్దలు/ కవిత్వానికి ఆమ్రేడితం అమృతం’ అనాలి మనమిప్పుడు’ అంటారు ‘ఆమ్రేడితం’ వచన పద్యంలో కవి (పేజీ.9). ‘బతుకడమొక్కటే నీ చేతిలో ఉంది/ అరచేతిలో జీవితమంటే అదే మరి’ అంటారు గొప్ప తాత్త్వలిక భావనతో ‘జీవితం’ (పేజీ. 11) అనే కవితలో కవి. బతుకు బంతితో/ కాలం మైదానం మీద ఆటా(డుకోవాలి) సాగుతుంది/ సత్యం ధర్మం ఎంపైర్లుగా/ ఆఖరి శ్వాస దాకా/ ఆడుతూనే ఉండాలి/ గాలి ఆగిన తరువాత/ గెలుపోటములను ప్రకటిస్తారు (పేజి 16). ఇదే కదా జీవితసత్యం అనురాగం జెండా పట్టుకుని/ అహింసా ఖడ్గాన్ని ధరించి/ అనుతాపం కవచం తొడుక్కుని/ ఆఖరులోనైనా నిన్ను విజయం వర్తిస్తుంది/ అవని అడవిలో ఆశ్రమమవుతుంది’ అంటారు యుద్ధం (పేజీ 19) కవితలో కవి.
కరోనాపై ‘గుణపాఠం’ కవితలో కవి పౌరాణికంగా ప్రారంభంలోనే ఇలా అన్నారు (పేజీ 43) ‘ప్రపంచం/ ప్రాణంబులో ఠావులో దప్పిన/ గజరాజు వైరస్ శాపానికి గురయిన పరీక్షిత్తు నీవే తప్ప అంటే నీరజాక్షుడు రాడు/ భాగవతం వినిపించడానికి శకమహర్షి లేడు’ అంటారు. ‘శతరూపగా జత రూపుగా పుట్టిన పదార్ధం/ సరససాఫల్య సంతానం సృష్టికావ్యం/ నానార్ధాలూ – యోగార్ధాలూ – యుగళంగా కనిపించే అధ్వైతం’ అంటారు (పేజీ 70). ‘తెల్లారగానే చద్దన్నం పెట్టడానికి/ తలుపేసి తానూ వెళ్లడానికి/ పల్లె ఇల్లాలు ఆరాటం’ అంటారు. మృగశిర కవితలో కవి (పేజి.88). బతుకైతపమై జనారణ్యంలో మనుషులు ప్రపంచమంతా ఇప్పుడొక శతద్రు (పేజీ 94) అంటారు. ఇదే సంపుటికి శీర్షికగా పెట్టారు. మానవుని జీవిత గమనం కేంద్రంగా ఈ వచన పద్యధార అమృతధారగా సాగింది. మీరూ గ్రోలండి.
– తంగిరాల చక్రవర్తి, 9393804472