– నేటి నుంచి టీజీ పేరుతో వాహన రిజిస్ట్రేషన్లు
– రాష్ట్రవ్యాప్తంగా టీజీ 0001 నుంచి ప్రారంభం
– కొత్త వాహనాలకే ఈ రిజిస్ట్రేషన్
– యథావిధిగా ఏపీ, టీఎస్ నంబర్ ప్లేట్లు..
– సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసిన రవాణాశాఖ
నవతెలంగాణ- సిటీబ్యూరో
నేటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్స్ టీజీ పేరుతో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గెజిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచే టీజీ 0001 సీరిస్ పేరిట వాహనాల రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ఆయా జిల్లాలకు కేటాయించిన కోడ్‌తో (33 జిల్లాలు..టీజీ-01 నుంచి టీజీ-38) ఈ వాహన రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటివరకు టీఎస్ పేరిట జరిగిన వాహనాలు యథావిధిగా కొనసాగుతాయి. నూతన వాహనాలకే టీజీ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రవాణాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకోసం ఆ శాఖ గురువారం సాయంత్రం 4గంటల తర్వాత అన్ని రవాణా సర్వీసులను నిలిపివేసింది. అనంతరం సాఫ్ట్‌వేర్‌లో టీఎస్ స్థానంలో టీజీగా మార్చే పనులు చేపట్టింది. ఆ మేరకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేసి.. ట్రయల్ రన్ కూడా నిర్వహించింది. ట్రయల్ రన్ సక్సెస్‌ను బట్టి నేటి నుంచి అమల్లోకి తీసుకురానుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై వరుస సమీక్షలు చేస్తూ.. అవసరమైన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో వాహన రిజిస్ట్రేషన్లకు టీఎస్ కాకుండా టీజీగా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2014 జూన్ 2 తర్వాత అప్పటి ప్రభుత్వం కొత్త వాహనాలకు టీఎస్ పేరుతో వాహన రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గత ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ టీజీ పేరుతో వాహన రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 4న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేసింది. అదే నెల 20న ఈ అంశంపైనే ప్రత్యేకంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత తెలుపగా.. మార్చి 12న కేంద్ర రవాణాశాఖ గెజిట్ విడుదల చేసింది. అందుకు కొనసాగింపుగా గురువారం తెలంగాణ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా ప్రతిపాదిస్తూ గెజిట్ విడుదల చేసింది.
కొత్త నెంబర్లు.. ‘ఫ్యానీ’కి ఫుల్ గిరాకీ..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54 రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఇప్పటివరకు ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో అన్ని రకాల వాహనాలు 70 లక్షలు ఉండగా.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన ఈ పదేండ్ల కాలంలో దాదాపు 92లక్షల వాహనాలు టీఎస్ పేరుతో రిజిస్టరయ్యాయి. ప్రస్తుతం ఈ వాహనాలు యథావిధిగా కొనసాగనున్నాయి. కొత్తగా రిజిస్ట్రేషనయ్యే వాహనాలకు మాత్రమే టీజీ పేరుతో నెంబర్లను కేటాయించనున్నారు. గురువారంతోనే టీఎస్ సీరిస్ పేరిట రిజిస్ట్రేషన్ క్లోజ్ చేశారు. ఇప్పటికే నెంబర్లు రిజర్వ్ చేసుకున్న వారికి మాత్రం ఈనెల 29 వరకు సమయం ఉంటుంది. నేటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు టీజీ 0001 కేటాయించనున్నారు. ఉదాహరణకు ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో చూసుకున్నట్టయితే.. టీజీ09ఏఏ0001 నెంబర్ రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానూ ఆయా జిల్లాలకు కేటాయించిన కోడ్ సీరిస్‌తో రానున్నాయి. వాహన యజమానులు 0001 నుంచి 0999 వరకు నంబర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాగా, మళ్లీ ప్రారంభ సీరిస్‌తో నెంబర్లు వస్తుండటంతో వచ్చే వారం పది రోజులు ఫ్యాన్సీ నంబర్లకు ఫుల్ గిరాకీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆర్టీఏ ఖజానాకు సైతం భారీగా ఆదాయం సమకూరనుంది.
ముఖ్యమంత్రికి ప్రత్యేక నెంబర్ కేటాయింపు?
టీఎస్ నుంచి టీజీగా మారుతుండటంతో అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే కొత్త వాహనాలు కొన్నవారు టీజీ నెంబర్ ప్లేట్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎంతో ఆత్రుతతో ఉన్నారని, వందల సంఖ్యలో వాహనదారులు ఎదురు చూస్తున్నారని ఆర్టీఏ అధికారులు చెబుతు న్నారు. శుక్రవారం నుంచి టీజీగా వాహన రిజిస్ట్రేషన్లు ప్రారంభమవు తుండటంతో ఆర్టీఏ కార్యాలయా లకు వాహనాదారులు భారీగా తరలొచ్చే అవకాశాలున్నాయి. అయితే నెంబర్ల కేటాయింపు అంతా ఆన్‌లైన్‌లో జరుగు తుండటంతో ఇబ్బం దులు ఉండక పోవచ్చు. ఇప్పటికే సీఎంవో వర్గాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వరు కోసం టీజీ09 ఆర్‌ఆర్ 0009 పేరిట నెంబర్ రిజర్వ్ చేసుకునేం దుకు కావాల్సిన దరఖాస్తు సమర్పించినట్టు సమాచారం. అందుకోసం ప్రభుత్వం త్వరలో ప్రత్యేక జీవో జారీ చేయనున్నట్టు తెలిసింది.