థాయిలాండ్‌ ప్రధాని తొలగింపు

– నైతిక విలువలను ఉల్లంఘించినందుకు..
బ్యాంకాక్‌ : నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై థాయిలాండ్‌ ప్రధాని శ్రేట్టా థావిసిన్‌ను పదవి నుండి తొలగిస్తూ థాయిలాండ్‌ న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల క్రితమే ప్రధాన ప్రతిపక్షాన్ని కోర్టు రద్దు చేయడం ఆ వెంటనే ఈ తాజా పరిణామంతో థాయి రాజకీయాలు పెను కుదుపునకు గురయ్యాయి. కోర్టు అధికారికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని కేబినెట్‌ మంత్రిగా నియమించి ప్రధాని నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారని రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కొత్త ప్రధానిని పార్లమెంట్‌ ఎన్నుకునేవరకు మంత్రివర్గమే ఆపద్ధర్మ పాలన సాగిస్తుందని కోర్టు పేర్కొంది. కాగా ప్రధానిని నియమించేందుకు పార్లమెంట్‌కు ఎలాంటి కాలపరిమితిని విధించలేదు. ఏప్రిల్‌లో కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు పిచిత్‌ చున్‌బన్‌ను కేబినెట్‌మంత్రిగా శ్రేట్టా నియమించారు. 2008లో కోర్టు ధిక్కార అభియోగాలపై పిచిత్‌ ఆరు మాసాల పాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు శిక్ష అనుభవించడంతో పాటూ పిచిత్‌ వ్యవహార శైలి నిజాయితీగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత కూడా ఆయనను కేబినెట్‌ మంత్రిగా నియమించి నైతిక విలువలను ప్రధాని ఉల్లంఘించారని కోర్టు పేర్కొంది. తన నియమాకంపై తీవ్ర విమర్శలు రావడంతో పిచిత్‌ కొద్ది వారాల క్రితమే తన పదవికి రాజీనామా చేశారు.