ఠాణాలో నాయకుడు డాన్స్ పై సీరియస్

– ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పై  వేటు 
– హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ 
– ఎస్సై వీఆర్ కు  బదిలీ
నవతెలంగాణ – మహాదేవపూర్
మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఉదయం ఓ రాజకీయ పార్టీ నేత డాన్స్ చేసిన ఘటనలో  పోలీస్ స్టేషన్ ఇన్చార్జిగా ఉండి, విధి నిర్వహణలో అలసత్వం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ ను  సస్పెండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాఎస్పీ కిరణ్ ఖరే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో మహాదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ ను మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ నుంచి (వెకెన్సీ రిజర్వు)కు  బదిలీ చేశారు.  ఈ ఘటనపై  స్పందించిన ఎస్పీ ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం వహించొద్దని అన్నారు. ప్రజల్లో పోలీసు శాఖపై ప్రతిష్ఠ పెంచే విధంగా పనితీరు ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే  పేర్కొన్నారు.