తంగవేలు తీన్‌మార్‌

Thangavelu Thinmarఅన్ని అవయవాలు సక్రమంగా ఉండి.. అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. తామేమీ సాధించాలేమనే నిరాశలో కుంగిపోతూ చాలా మంది తమ జీవితాలను వథా చేసుకుంటుంటారు. అలాంటివాళ్లు ఒక్కసారి ఈ వీరుల గురించి తెలుసుకుంటే.. ఈ యోధుల కథలు వింటే జీవితంపై కొత్త ఆశ చిగురించడం ఖాయం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి. వాటిని దాటితేనే విజేతలుగా నిలుస్తారు. కానీ వీళ్ల జీవితమే కష్టతరమై.. జీవన ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా.. వెన్నుచూపలేదు. భయపడి చీకటిలోనే ఉండిపోలేదు. వైకల్యాన్ని అధిగమించి ఆటల్లో సత్తాచాటి వెలుగులోకి వచ్చారు. ఇప్పుడదే ఆటల్లో దేశం తరపున పారాలింపిక్స్‌లో పతకాలు సాధించి… పారిస్‌ పోడియంపై నిలబడి.. దేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.
ఒకటి, రెండు, మూడు… అతని అడుగులు వేగంగా పడ్డాయి. ఎప్పటిలాగే ఒంటి కాలిపై వేగంగా ముందుకు దూసుకుపోయి చేసిన జంప్‌ మరో పారాలింపిక్‌ పతకాన్ని అందించింది. ఒకటి కాదు రెండు కాదు ఇది వరుసగా మూడో పారాలింపిక్‌ మెడల్‌… ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా 29 ఏండ్ల మరియప్పన్‌ తంగవేలు సగర్వంగా నిలిచాడు. హైజంప్‌లో ఎదురులేకుండా సాగిన అతను 2016 ‘రియో’లో స్వర్ణం, 2020 ‘టోక్యో’లో రజతం గెలవగా… 2024 ‘పారిస్‌’లో కాంస్యం దక్కింది. ఐదేళ్ల వయసులో అంగవైకల్యాన్ని ఎదుర్కొన్న రోజు నుంచి ఇప్పుడు పారా క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించే వరకు తంగవేలు సాగించిన ప్రస్థానం అసాధారణం, అందరికీ స్ఫూర్తిదాయం.
పేదరికానికి చిరునామాలాంటి కుటుంబంలో జన్మించిన తంగవేలుకు అనూహ్యంగా ఎదురైన వైకల్యం కష్టాలతో పాటు అతనిలో పట్టుదలను కూడా పెంచింది. తమిళనాడు సేలం వద్ద ఒక చిన్న గ్రామం అతనిది. ఐదేండ్ల వయసులో స్కూల్‌కు వెళుతుండగా తాగి బస్సు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన కుడికాలును శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత కూడా దానిని ఏం చేయలేమని డాక్టర్లు తేల్చేశారు. నిజానికి వైద్య ఖర్చుల కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. 17ఏండ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కుటుంబానికి ఆర్థిక పరిహారం అందింది. అయితే అందులో సగం న్యాయపరమైన ఖర్చుల కోసం అయిపోయింది.
తల్లే తండ్రిగా మారి.. రోజూ వారీ కూలీగా
ఆరుగురు పిల్లల కుటుంబంలో అతనొకడు. తండ్రి పట్టించుకోకపోవడంతో తల్లి సరోజ కూలీ పని చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఆపై ఆమెకు ఛాతీ నొప్పి రావడంతో కూలీ పనులకు వెళ్లలేకపోయింది. ఇటు చూస్తే పిల్లలు చిన్నవాళ్లు వాళ్లకు పూటకు ఇంత తిండైనా పెట్టాలి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఏదో ఒకటి చేయకపోతే కుటుంబం రోడ్డున పడుతుందని ఆమె అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది. తీవ్ర ఇబ్బందుల మధ్య పిల్లలను పెంచింది. అలాంటి స్థితిలో తంగవేలు బాల్యం కూడా కష్టంగా గడిచింది. ఇలాంటి ఒడిదుడుకుల నడుమ పాఠశాల విద్య పూర్తి చేసిన తంగవేలు బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ సంపాదించాడు. చదువుకుంటూనే ఆటపై కూడా దష్టి సారించిన అతడు జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు.
కానీ స్కూల్‌ స్థాయిలో కూడా ఆ చిన్నారి ఎలాంటి బాధనూ తన దరిచేరనీయలేదు. తనకు స్పోర్ట్స్‌ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్‌లో ఆ కాలుతోనే అన్ని క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధపడిపోయేవాడు. అన్ని సక్రమంగా ఉన్నవారితో మరీ పోటీ పడి గెలిచేవాడు కూడా. తాను ఎవరికంటే తక్కువ కాదనే భావనను ఇది కలిగించిందని అతను చెప్పుకునేవాడు. వేర్వేరు క్రీడలతో మొదలైనా పీఈటీ సర్‌ సూచన మేరకు హైజంప్‌ను అతను తన గేమ్‌గా మార్చుకున్నాడు. ఇదే జోరులో ఎక్కడ అవకాశం దొరికినా పోటీలో పాల్గొంటూ జాతీయ పారా క్రీడల వరకు తంగవేలు చేరుకున్నాడు. తంగవేలు చదివే పాఠశాలలోని పీఈటీగా పని చేస్తున్న ఆర్‌ రాజేంద్రన్‌ అతడిని ఎంతగానో ఎంకరేజ్‌ చేశాడు. ఒంటికాలితోనే హై జంప్‌లో రాణించేలా శిక్షణ ఇచ్చింది కూడా అతడే. దివ్యాంగుల క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతో మేటి అయిన సత్యనారాయణ దష్టిలో పడటం తంగవేలు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆయన శిక్షణలో అసలైన ప్రొఫెషనల్‌ తరహా కోచింగ్‌ తంగవేలుకు లభించింది. ఫలితంగా పారా క్రీడల్లో తంగవేలుకు వరుస విజయాలు దక్కాయి. ఈ క్రమంలో 2016 రియో పారాలింపిక్స్‌కు అర్హత సాధించడంతో అతని గురించి ప్రపంచానికి తెలిసింది. ఇక ఆ తర్వాత ఒలింపిక్‌ పతకం, వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో స్వర్ణాలు తంగవేలుకు పేరు తెచ్చిపెట్టాయి. తన కోచ్‌ సత్యనారాయణ గురించి మధురైలో వేలమ్మాళ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ లో చెబుతూ ”అతన్ని కలవడానికి ముందు, నేను పాస్‌పోర్ట్‌ కూడా పొందలేకపోయాను. అందుకు డబ్బు లేకపోవడమే ప్రధాన కారణం. దీంతో నేను అంతర్జాతీయ ఈవెంట్‌లలో ఎప్పుడూ పాల్గొనలేక పోయాను. కానీ శిక్షణ ఇచ్చి నన్ను పోటీల కోసం విదేశాలకు పంపేందుకు తన జేబులోంచి డబ్బు ఖర్చు చేశారు మా కోచ్‌. అప్పుడు నాకు అర్ధమైంది. కేవలం డబ్బు ఒకటే ఉంటే సరిపోదు. అందుకు తగ్గ శిక్షణ, తోడ్పాటు చాలా అవసరం అని. నాకు మంచి క్రీడాకారుడిగా గుర్తింపు రావడానికి ఆయన పడిన శ్రమ మాటల్లో చెప్పలేనిది” అని గురువు పట్ల కతజ్ఞత చాటుకున్నాడు.
క్రీడల్లో గుర్తింపు తెచ్చుకొని కొంత డబ్బు రాగానే అతను కుటుంబ కనీస అవసరాలపైనే దష్టి పెట్టాడు. ముందుగా అమ్మ కోసం కొంత పొలం కొనడం, ఊర్లో సొంత ఇల్లు కట్టుకోవడంవంటివే చేశాడు. ‘అర్జున’… ‘పద్మశ్రీ’… ‘ఖేల్‌రత్న’ అవార్డుల తర్వాత స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కోచ్‌గా ఉద్యోగం కూడా దక్కడంతో తంగవేలు స్థిరపడ్డాడు. ఇప్పుడు మూడో ఒలింపిక్‌ పతకంతో పారా క్రీడల్లో శాశ్వత కీర్తిని అందుకున్నాడు.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417