థ్యాంక్స్‌…

– డిప్యూటీ సీఎంకు టీఐఎస్‌ఎమ్‌ఏ కృతజ్ఞతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ ఛార్జీలు పెంచకపోవడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఐరన్‌ అండ్‌ స్టీల్‌ మానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం అసోసియేషన్‌ ప్రతినిధిబృందం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రజాభవన్‌లో కలిసి కరెంటు చార్జీలు పెంచనందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచితే స్టీల్‌, ఐరన్‌ పరిశ్రమలు మూసివేసుకొనే పరిస్థితి ఏర్పడేదని ఆందోళన వ్యక్తంచేశారు. 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా వల్ల తమ పరిశ్రమ ఇప్పుడిప్పుడే స్థిర పడుతున్నదని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని పారిశ్రామిక రంగం వృద్ధి చెందాలని ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం కోరారు. పరిశ్రమలకు తక్కువ ధరలో వనరులు అందచేస్తామనీ, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని వివరించారు. స్టీలు, ఐరన్‌ పరిశ్రమల్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపంచేయాలని సూచించారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్‌ జాయింట్‌ ప్రెసిడెంట్‌ ప్రమోద్‌ అగర్వాల్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ నీరజ్‌ గొయెంక, జాయింట్‌ సెక్రెటరీ సుధాంశు శేఖర్‌, కోశాధికారి వినోద్‌ అగర్వాల్‌ తదితరులు ఉన్నారు.