చందమామ రావే, జాబిల్లి రావే! అంటూ చిన్న పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తూ పాడే పాట తెలుగు వారందరికీ చిరపరిచయమే. ఇన్నేండ్లుగా పిలిచినా సదరు జాబిల్లి రాకపోయే సరికి మనల్నే అక్కడికి పంపే ఏర్పాటు చేస్తున్నారు భారత ప్రధాని. అందుకు ఆయనకు థాంక్స్ చెప్పాలి కదా! కొండ మహ్మద్ గారి దగ్గరికి రాకపోతే మహ్మద్ గారే కొండ దగ్గరికి వెళ్ళారని కదా చెప్తారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారట! 2040 నాటికి తొలి భారతీయుణ్ణి చంద్రుడిపైకి పంపాలని ప్రధాని శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారని మీడియాలో వచ్చింది. శుక్రగ్రహం, అంగారక గ్రహాల్ని కూడా శోధించే పనిలోకి మన శాస్త్రవేత్తలు ఉపక్రమించాలని మోడీ డైరెక్షనట! దానికి సందేహమేముంది? మన సైంటిస్టులు అంతటి ఘటికులే! ‘భక్తులు’ పారవశ్యంతో ఆనందతాండవం మొదలుపెట్టారు. కొందరు మధ్య తరగతి ఓటర్లు చొంగ కార్చడం కూడా మొదలైంది.
సిద్దిపేట నుండి మనోహరాబాద్‌కు రైలేసినంత తేలిగ్గా, వర్చువల్‌గా దానికి జండా ఊపినంత సులువుగా చంద్రుడిపై మానవ కాపురాలు ఏర్పాటు చేసినట్లు, దాన్లో కొందరు వెంచర్లేసినట్లు ప్రధానికి కలలొస్తున్నాయేమో! పూలల్లోంచి తేనే మోసుకొచ్చి బ్యాంకు లాకర్లలో పోస్తున్నట్లు ఊహా లోకాల్లో విహరిస్తున్నారు మరికొందరు. ‘రసపట్టులో తర్కం కూడదని’ మాయాబజార్‌లో శ్రీకృష్ణుడు రుక్మిణితో అన్న మాటలు ప్రస్తుత పరిస్థితికి వర్తింపజేస్తే ఎన్నికల రసకందాయంలో ఉండగా మోడీ బృందంతో జనం తర్కించరాదని తాత్పర్యం.
ప్రపంచంలోకి ఒకసారి తొంగి చూద్దాం. అమెరికా దేశానికి చెందిన శత సహస్ర కోటీశ్వరుడు ఎలాన్‌మస్క్ ప్రారంభించిన స్పేస్ – ఎక్స్ అంతరిక్షంలో ఎనిమిది రోజులు తిరిగి రావడానికి అయ్యే ఖర్చు ఒక మనిషికి రూ.415 లక్షల కోట్లు. భూమి నుండి వంద కిలోమీటర్ల దూరానికి అయ్యే ఖర్చది. చంద్రుడు భూమి నుండి 3,84,400 కి.మీ. దూరం. అక్కడికెళ్ళడానికి ఖర్చెంతవుంది? అంత డబ్బు పెట్టగలిగే వారు దేశంలో ఎందరుంటారు? అసలు వెళ్ళే వారె వరు? స్పేస్ ఎక్స్‌ను 2023లో వందసార్లు పంపాలనుకుంటే అక్టోబర్ 18 నాటికి 73 సార్లే పంపగలిగారట అమెరికాలో. మిగిలిన 2 నెలల్లో పాతిక సార్లు పంపగలరా అనే సందేహం ఉంది. ఇప్పటికే ఎలాన్‌మస్క్, జెఫ్ బేజోస్ వంటి వాళ్లు ఒక చెక్కరేసి వచ్చారు. ఇటీవల సముద్ర గర్భంలో ఏమైనా సంపద నిక్షిప్తమై ఉందా అని పరిశీలించేందుకు ‘ఓషన్‌గేట్’ పేర నలుగురు కూచునే బుల్లి సబ్ మెరీన్ తయారు చేశారు అమెరికన్లు. దాన్లో ప్రయాణించి సముద్ర గర్భ సంపద శోధించాలంటే 2,50,000 అమెరికన్ డాలర్లు… అంటే 2 కోట్ల ఐదు లక్షల యాభై వేల రూపాయలు. నలుగురెక్కాల్సిన దాన్లో ఇటీవల ఒకడ్ని కింద కూచోబెట్టి సముద్రంలోకి దింపితే సముద్ర గర్భంలో అది లోనికి పేలిపోయింది (ఇంప్లోడ్). అందులో ఎక్కిన శతకోటీశ్వర్లు కలికానికి కూడా కనపబడకుండా పోయారు. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఆ మిషన్‌ను ఆపేసింది. అత్యంత ధనిక దేశంలో కనపడే దృశ్యాలివి.
మన దేశంలో బాగా సంపన్నులు నివసించే అహ్మదాబాద్ – ముంబైల మధ్య బులెట్ ట్రెయిన్ ప్రాజెక్టుకు 2015లోనే తెరలేపాడు మోడీ సాబ్. ఇదిగో… అదిగో అన్న బులెట్ ట్రెయిన్ ఇంకా పురిటినొప్పుల దశలోనే ఉంది. ప్రయాణానికి పట్టే సమయం, అయ్యే ఖర్చు (అప్పటికున్న అంచనాల ప్రకారం) చూసి విమానంలో పోవచ్చు కదా అనే చర్చ ప్రారంభమైంది. మన ప్రధాని తన వైఫల్యాలను కనపడనీయరు కాబట్టే దేశమంతా వందేభారత్ రైళ్ళను ఉరుకులు పెట్టిస్తున్నాడు. మధ్య తరగతి సెల్ఫీలు, సోషల్ మీడియాలో పోస్టులు షరా మామూలే! పాలకుల కాళ్లు, కళ్లు నేలపై ఉంటే పాలన సవ్యంగా ఉంటుంది.
దేశంలో రైలు మొహం చూడని ప్రాంతాలు ఎన్నో వున్నాయి. బస్సు సౌకర్యం లేని గ్రామాలు వేలల్లో ఉన్నాయి. పురిటిలోనే చనిపోయే బిడ్డలు, రక్తహీనతతో బతికే మహిళలు కోట్లల్లో ఉన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో నేటికీ ఆడపిల్లలకు చదువు నిషిద్ధం. భ్రూణ హత్యలు ఇప్పటికీ సాగుతున్నాయి. వరకట్న పీడితులు కుల, మతాలకతీతంగా కోట్లల్లో ఉన్నారు. పైగా ‘సతీ సహగమనం ఉండాల్సిందే’నని నేటి ఉత్తర భారత దేశ బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. ‘అంటరానితనం నిషేధం’ అనే చట్టాన్నే రద్దు చేయమని వి.హెచ్.పి. గతంలోనే డిమాండు చేసిన విషయం మనం మరువరాదు. తాజా మానవాభివృద్ధి సూచికలో 191 దేశాల్లో మన దేశం 132 వ స్థానంలో ఉంది. రాకెట్లు, చంద్రునిపై నివాసం సంగతి సరే, ముందు ప్రభుత్వాలు వీటిని సరి చేయాలి. లేదా ఆ పాలకుల్ని మనం సరిచేయాలి.