– నాలుగు రోజుల్లో కోటి45 లక్షల మందికి దర్శనం
– ‘తెలంగాణ’ ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటింది మీడియా : పంచాయతీరాజ్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ-ములుగు
మేడారం జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. నాలుగు రోజుల్లో కోటి 45 లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారని చెప్పారు. శనివారం మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. జాతర నిర్వహణకు అత్యధిక నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వరదల కారణంగా పూర్తిగా నష్టపోయిన మేడారం పరిసర ప్రాంతాలలో అన్ని మరమ్మతులు చేయించామని తెలిపారు. 20 శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేశారని అభినందించారు. క్యాబినెట్‌లోని అన్ని శాఖల మంత్రులు జాతర నిర్వహణకు సహకరిం చారని, ఆర్టీసీ సంస్థ ద్వారా మేడారం జాతరకు 10వేల ట్రిప్పుల బస్సులు నడిచాయని తెలిపారు. 13మంది వీవీఐపీలు, 150మంది వీఐపీలు అమ్మవార్లను దర్శించుకున్నట్టు చెప్పారు. ఇద్దరు సందర్శకులు ప్రమాదవశాత్తు మృతిచెందార ని, గతంతో పోలిస్తే ఈ జాతర చాలా మెరుగ్గా జరిగినట్టు తెలిపారు. అమ్మవార్ల వన ప్రవేశానికి వెళ్లే సమయం వచ్చినప్పటికీ ఇంకా సందర్శకుల రద్దీ కొనసాగుతుందని, జాతరలో ఏమైనా లోపాలు ఉంటే అధికారులతో సమీక్ష నిర్వహించి తిరుగు వారం తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తామన్నారు. 5090 మంది తప్పిపోయారని, వారిలో 5060 మందిని మిస్సింగ్ క్యాంపుల ద్వారా గుర్తించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చినట్టు వివరించారు. ఇంకా 35మంది తమ దగ్గర ఉన్నారన్నారు. జాతర పూర్తైన పది రోజుల వరకు కూడా పారిశుధ్య పనులు కొనసాగుతాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షను దేశ వ్యాప్తంగా చాటింది మీడియా మాత్రమేనని గుర్తు చేశారు. జాతరకు సహకరించిన పూజారులు, ఆదివాసీలు, అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీవో అంకిత్ తదితరులు పాల్గొన్నారు.