హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ ‘చ90’- ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. ఎంఎన్‌ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మించగా, నవీన్ మేడారం సమర్పించారు. ఈటీవీ విన్ వేదికగా ఈనెల 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌లో హీరో శివాజీ మాట్లాడుతూ, ‘నేను చేసిన ‘మిస్సమ్మ’ అప్పటికీ ఇండియన్ టాప్ 50 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇవాళ ఇండియన్ ఓటీటీలో టాప్5 లో ఉండటానికి అన్ని క్యాలిటీస్ వున్న వెబ్ సిరిస్ ఇది. ఈ ఒక్క సిరీస్‌తో ఐదు లక్షల సబ్ స్క్రైబర్స్ రావడం మాములు విషయం కాదు. ఆదిత్య అద్భుతంగా రాశాడు. ఈ సక్సెస్ క్రెడిట్ తనదే. నా కెరీర్‌లో మెమరబుల్‌గా నిలిచిపోతుంది. అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఈటీవీ విన్‌కి, ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ‘దర్శకుడు ఈ కథ చెప్పినపుడు తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం కుదిరింది. అది ఈరోజు నిజం కావడం ఆనందంగా ఉంది’ అని వాసుకి చెప్పారు.