జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ ప్రారంభించిన సీఎంకు కృతజ్ఞతలు

జేపీఎస్‌లకు శుభాకాంక్షలు : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. జేపీఎస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. క్రమబద్ధీకరణ విధివిధానాలపై చర్చించేందుకుగానూ సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎస్‌ శాంతికుమారి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాతో ఆయన భేటీ అయ్యారు. వారి సర్వీసును క్రమబద్ధీకరించే మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమనీ, సీఎం కేసీఆర్‌ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్‌ చేయడానికి అంగీకరించడమేగాక, ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జేపీఎస్‌లు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.