– కన్వర్ యాత్ర సమయంలో మత గుర్తింపు బయటపడకుండా జాగ్రత్తలు
– వాట్సాప్ గ్రూపులలో యూనియన్ల హెచ్చరికలు
– యూపీ, ఢిల్లీలలో భయంతోనే కాలం వెళ్లదీస్తున్న డ్రైవర్లు
లక్నో : యూపీలో హిందూత్వ శక్తుల చర్యలు మైనారిటీ వర్గాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా, కన్వర్ యాత్ర సమయంలో యూపీతో పాటు ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లలో రెచ్చిపోతున్నాయి. వీరికి రాష్ట్రంలో యోగి సర్కారు తీరు కూడా తోడై పరిస్థితులను మరింత దిగజార్చుతున్నాయి. దీంతో మైనారిటీ వర్గ ప్రజలు తమ గుర్తింపును బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడ తమ మత గుర్తింపు బయటపడితే హిందూత్వ శక్తుల చేతిలో దాడికి గురవుతామనే భయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం డ్రైవర్లు కూడా తమ గుర్తింపును దాచిపెట్టుకుంటున్నారు. కార్ల నుంచి మతపరమైన గుర్తులను తొలగించటం చేస్తున్నారు.
వీరు తమ వాట్సప్ గ్రూపులలో ఈ ముందు జాగ్రత్త చర్యల గురించి చర్చించుకుంటున్నారు. ఈ సందేశం ఢిల్లీ, యూపీలలోని హిందూయేతర డ్రైవర్లనుద్దేశిస్తూ ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా, హర్యానా కన్వర్ యాత్ర మార్గంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. యూనియన్ జాతీయ కార్యదర్శి షేక్ సలావుదీన్ వాయిస్ నోట్‌లో కన్వర్ యాత్ర గురించి ప్రస్తావించలేదు. అయితే కేవలం కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన యాత్ర మార్గంలో ముస్లిం డ్రైవర్‌పై హింసపై తీవ్ర చర్చ జరిగింది. సలావుదీన్ మాట్లాడుతూ.. యూనియన్ డ్రైవర్‌లను స్టిక్కర్లు లేదా హ్యాంగింగ్ యాక్సెసరీస్ వంటి వారి మతానికి సంబంధించిన గుర్తులను తీసివేయాలని కోరామని చెప్పారు. ఐఎఫ్‌ఏటీ అనేక టాక్సీ డ్రైవర్ల సంఘాల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నది. దేశవ్యాప్తంగా 75,000 మందికి పైగా గిగ్ వర్కర్లను కలిగి ఉన్నది. ఈ గిగ్ వర్కర్లు వివిధ సంస్థలకు పని చేస్తున్నారు. దీంతో ఢిల్లీలో కొంత మంది ముస్లిం డ్రైవర్లు తమ మతపరమైన గుర్తింపును దాచిపెట్టారు. అంతేకాకుండా, కన్వార్ యాత్ర మార్గంలో ప్రయాణాలు చేయటం తగ్గించారు.
గతనెల 27న తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో లక్నో-గురుగ్రామ్ హైవేపై ముస్లిం డ్రైవర్‌పై దాడి జరిగిన తర్వాత హైదరాబాద్‌కు చెందిన సలావుదీన్ వాయిస్ నోట్ వచ్చింది. ముస్లిం డ్రైవర్‌తో రైడింగ్ చేసినందుకు కొంత మంది హిందువులను బెదిరించారు. ఇకపై ముస్లిం డ్రైవర్‌తో రైడ్‌ను బుక్ చేయబోమని ప్రయాణికులు హామీ ఇవ్వడంతో కన్వారియాలు వారిని విడిచిపెట్టారు. కాగా, ఈ విషయంలో ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని డ్రైవర్ చెప్పాడు. ”ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగింది ఎందుకంటే వారు డ్రైవర్ మతాన్ని దూరం నుంచి గుర్తించగలిగారు. అందుకే మేము మా డ్రైవర్‌లకు వారి గుర్తింపును దాచిపెట్టి, అలాంటి సంఘటనల నుంచి తమను తాము రక్షించుకోవాలని చెబుతున్నాము. ముస్లిం డ్రైవర్లు ఈ సంవత్సరం మరింత బెదిరింపులకు గురవుతున్నారు. ఎందుకంటే యూపీ ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులను జారీ చేయటం ద్వారా మతం ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేసింది” అని సలావుదీన్ తెలిపారు.
కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాలు, ఆహార దుకాణాల యజమానులు.. వారి పేర్లు, వారి సిబ్బంది పేర్లను బహిర్గతపర్చాలన్న ఆదేశాలున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇలాంటి ఆదేశాలను ఆమోదించాయి. అయితే సుప్రీంకోర్టు వాటిపై స్టే విధించింది. ఆహార దుకాణాలు, తినుబండారాల యజమానులను అలా చేయాలని బలవంతం చేయలేమని పేర్కొన్నది. ”మేము డ్రైవర్లను వారి మతానికి సంబంధించిన స్టిక్కర్లు లేదా హ్యాంగింగ్ యాక్సెసరీస్ వంటి గుర్తులను తొలగించమని కోరాం. తటస్థంగా ఉండాలని అన్ని సంఘాల డ్రైవర్లకు మేము దీన్ని సూచించాం. ఎవరైనా వారిపై దాడికి వస్తే ఏమి చేయాలో కూడా మేము వారికి చెప్తున్నాం. దాడుల సమయంలో జాగ్రత్త వహించి.. పోలీసులకు డయల్ చేయాలనీ, ఆ సమయంలో మాకు సమాచారమందిస్తే మేము వారికి వెంటనే సహాయం చేయడానికి వారి స్థానాన్ని వాట్సాప్ గ్రూపులలో పంపుతామని చెప్పాం” అని ఐఎఫ్‌ఏటీ సభ్యులు చెప్తున్నారు. హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, సుల్తాన్‌గంజ్, డియోఘర్‌తో సహా ప్రముఖ గమ్యస్థానాల నుంచి ఆగస్టు 5 నాటికి కన్వారియాలు తమ ఇండ్లకు తిరిగి వచ్చే అవకాశమున్నందున మైనారిటీ వర్గాల వాట్సప్ గ్రూపులలో హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి. గతనెల 22న ప్రారంభమై ఆగస్టు 2న ముగిసిన కన్వర్ యాత్రలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయం విదితమే.