దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాల పాటి శ్రీధర్ సమర్పిస్తు న్నారు. మారేష్ శివన్ దర్శకుడు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాత. ఈనెల 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు మారేష్ శివన్ మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రతీ మనిషిలో జరిగే కథ ఇదే. ప్రేమ, లక్ష్యం ఒకేసారి ఎంచుకోవాల్సి వస్తే ఏం చేస్తారు?, ఏం చేయాలి అనే మెసెజ్‌తో మూవీని తీశాను. చిత్రాన్ని చూసిన తరువాత కొంత మంది అయినా సరే మారుతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అదే ట్రాన్స్‌లో ఉంటారు.
నా జీవితం అనే కాదు.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు అరె.. ఇలాంటివి మన జీవితంలోనూ జరిగాయి కదా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకే ఈ సినిమా అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను. మా సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఈ చిత్రాన్ని మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.
తొలుత 200 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మౌత్ టాక్ బాగుంటే మళ్లీ థియేటర్లను పెంచాలని అనుకుంటున్నాం. ఇలాంటి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు మా చిత్ర బృందం అంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ కోవలోకే ఈ సినిమా కూడా చేరుతుందని ఆశిస్తున్నాం’
అని తెలిపారు.