అది బీఆర్‌ఎస్‌ అబద్ధాల సభ

– కేసీఆర్‌ ఇప్పటికైనా నిజాలు చెప్పాలి : రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చలో నల్లగొండ పేరిట బీఆర్‌ఎస్‌ నిర్వహించింది అబద్దాల సభ అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ప్రజల ముందుకొచ్చిన కేసీఆర్‌ నిజాలు మాట్లాడుతారని భావించామనీ, కానీ తన సహజ పద్ధతిలోన ఆయన అబద్ధాలు మాట్లాడారని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో జరిగిన చర్చకు రాకుండా పిల్లిలా పారిపోయిన కేసీఆర్‌ను పులి అంటారా? పిల్లి అంటారా? అని ప్రశ్నించారు. గడిచిన పదేండ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
అధికారం కొల్పోయిన తర్వాత ప్రజల ఉద్వేగాలను, మనోభావాలను మరోసారి ఆయన రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్తగా కేఆర్‌ఎంబీ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శలు గుప్పించారు. ఉల్టా చోర్‌ కొత్వాల్‌ డాంటే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉందన్నారు. ప్రజలు తిరగబడి బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేసీఆర్‌ తన పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు.