ఆమే ఓ ధైర్యం..ఓ పోరాటం

She is brave..oporatamమల్లు స్వరాజ్యం… ఈ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని యోధురాలు. పుట్టింది భూస్వామ్య కుటుంబంలో. వెట్టి బతుకుల వెతలు తీర్చడం కోసం అడవుల్లో, గిరిజన గూడాల్లో బతికింది. అన్న నర్సింహారెడ్డితో కలిసి దొరలను సవాల్‌ చేసింది. 14 ఏండ్లకే తుపాకీ పట్టి దోపిడీ దారులపై పులిలా తిరగబడింది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ సీపీఐ(ఎం) 4వ రాష్ట్ర మహాసభలు జరగబోతున్న సందర్భంగా ఆ వీరనారి స్ఫూర్తిదాయక జీవిత పరిచయం నేటి మానవిలో…
మల్లు స్వరాజ్యం 1930-31 కాలంలో తుంగతుర్తి తాలూకా కరవీరాల కొత్తగూడెంలోని భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు జన్మించారు. అప్పటికే ఆమె బంధువులంతా స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారు. వారి ప్రభావంతో ముఖ్యంగా అన్న నర్సింహారెడ్డి ప్రోత్సాహంతో అత్యంత చిన్న వయసులోనే దోపిడి, పీడనపై పిడికిలి బిగించారు. ఆనాడు ఆడపిల్లలకు చదువుకునే అవకాశం తక్కువ. భూస్వామ్య కుటుంబాల్లోని అమ్మాయిలకు గుర్రపుస్వారీ, ఈత వంటివి నేర్పించేవారు. అలా స్వరాజ్యం కూడా అన్నతో కలిసి నేర్చుకుంది. చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆనాటి దొరల, భూస్వాముల ఆగడాలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయింది. వారి బతుకులు బాగు చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంది. అన్నతో కలిసి ఆయుధం పట్టి అడవి బాట పట్టింది.
ఆమె జీవితం పేదలకే అంకితం
ఎనిమిదేండ్ల వయసులోనే స్వరాజ్యం తండ్రిని కోల్పోయారు. అప్పటి నుండి చిన్నాన వీరి కుటుంబానికి పెద్దదిక్కు అయ్యారు. తల్లికి తన పిల్లలను బాగా చదివించాలని కోరిక. కానీ స్వరాజ్యం మాత్రం తన జీవితాన్ని పేదలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆనాడు భూస్వామ్య కుటుంబాల్లో సంప్రదాయాలు, సనాతన భావాలు, ఆడపిల్లలపై ఆంక్షలు విపరీతంగా ఉండేవి. బయట అడుగుపెట్టనిచ్చేవారు కాదు. ఒకవేళ వస్తే పరదా ధరించాల్సిందే. అటువంటి పరిస్థితుల్లోనే స్వరాజ్యం అబ్బాయిలతో కలిసి కబడ్డీ ఆడేవారు. బంధువులు ఎవరైనా కోపగిస్తే తప్పేంటని ప్రశ్నించేవారు. అప్పట్లో ఆడపిల్లలకు చిన్నతనంలోనే ముసలివారికి ఇచ్చి పెండ్లి చేసేవారు. అలాంటి ఆడపిల్లల బాధలు చూసి భరించలేక బాల్యవివాహలకు వ్యతిరేకంగా సంఘం పెట్టి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆంధ్రమహాసభ పిలుపుతో…
హైదరాబాద్‌లో ఆంధ్రమహాసభ జరుగుతుంటే అన్నతో కలిసి వెళ్లారు. అక్కడ జరిగిన చర్చలు, ఉపన్యాసాలు, దేశ స్వాతంత్రం, చదువు, మహిళలకు ప్రత్యేక హక్కులు, వెట్టి చాకిరి, భూస్వాముల దోపిడి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం ఇలా ఎన్నో స్వరాజ్యంను ఉత్సాహపరిచాయి. స్త్రీల పట్ల మమకారం, గౌరవం ఉండాలి. స్త్రీలకు హక్కులు ఉండాలి అనే ఆంధ్రమహాసభ పిలుపు స్వరాజ్యంపై తీవ్రంగా పడింది. అలాగే దేవులపల్లి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, అన్న భీంరెడ్డి ప్రభావం కూడా ఈమెపై ఉంది. ఇంకా మాక్సిమ్‌ గోర్కి రాసిన అమ్మ నవల ప్రభావం, రష్యా విప్లవ ప్రభావం నాటి పోరాట యోధులపై పడినట్టే ఆమెను కూడా ప్రభావితం చేశాయి.
గొప్ప వ్యూహకర్తగా…
బడి చదువు పెద్దగా లేని ఆమె సోవియెట్‌ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసేవారు. ప్రజల బాణీల్లో స్వయంగా పాటలు అల్లేవారు. ఫలితంగా మార్క్సిస్ట్‌ అవగాహనను స్థానిక పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించగల వ్యూహకర్తగా మారారు. ఏ సమస్యమీదైనా అనర్గళంగా ఉపన్యసించేవారు. ‘ఏనాడు కూలివాడల్లో బతకడం మొదలుపెట్టానో అవే నా ఉద్యమ జన్మస్థానాలుగా మారాయి. నా ఉపన్యాసాలకు విషయాన్ని అందించింది, నా పాటలకు బాణీలనిచ్చింది బడుగు జీవితాలే. నా జీవితానికి ఓ చరిత్రను ఇచ్చిందీ వాళ్లే’ అనేవారు ఆమె. ఇదే ఆమెను అచ్చమైన ప్రజల మనిషిగా నిలిపింది.
ప్రజాప్రతినిధిగా…
1978లో తుంగతుర్తి నుండి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆమె ప్రజా జీవితం మొత్తం అత్యంత సాదాసీదాగా ఉండేది. ఎవరికి కష్టం వచ్చినా వెంటనే స్పందించేవారు. ఎమ్మెల్యేగా ఉండి కాలినడకన, మోటర్‌ సైకిల్‌, బస్సుల్లో నియోజకవర్గమంతా తిరిగేవారు. సమస్యలను బట్టి వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించేవారు. అవసరమైతే ప్రజలను వెంటబెట్టుకెళ్లి వాటిని పరిష్కరించుకొని వచ్చేవారు. అరవై ఏండ్ల తన ప్రజా జీవితంలో అలుపెరుగక ఉద్యమించారు. ఆమె జీవితం, పోరాటాల చరిత్ర భావితరాలకు ఆదర్శం. తన చివరి దశలోనూ దేశంలో జరుగుతున్న కుల, మత విద్వేషాలను నిరసించారు. ఈ విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రజలు ఐక్యతతో తిప్పికొట్టాలని నినదించారు.
నిండైన జీవితం ఆమెది
నిజంగా ఆమె ఒక చైతనం. ఒక ధైర్యం.. ఒక పోరాటం.. ఒక విప్లవం.. ఒక ఉద్యమం. ఆమె జీవితమే ఆదర్శం. తన తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన నిండైన జీవితం. తెలంగాణ సాయుధ పోరాటంలో తన కంటూ ఓ ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు. ప్రజాప్రతినిధిగానూ ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి ధీరవనిత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ 93 ఏండ్ల వయసులో 2022 మార్చి 19న కన్నుమూశారు. ఆమె ఆశయ బాటలో నడుస్తూ ఆమె చిన్న కొడుకు నాగార్జున రెడ్డి సూర్యపేట సీపీఎం జిల్లా కార్యదర్శిగా, కోడలు లక్ష్మి ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చూస్తూ పూర్తికాలం కార్యకర్తలుగా పని చేస్తున్నారు. ఆర్థోపెడిక్‌గా ఉన్న మనువడు డాక్టర్‌ మల్లు అరుణ్‌ ఎంవీఎన్‌ఆర్‌ క్లినిక్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉచిత సేవలు అందిస్తున్నారు.
శ్రమను గౌరవించడం అలవడింది
అమ్మ నుండి కష్టపడేతత్వం, మానవత్వం అలవడ్డాయి. ఈ రెండు విషయాలు అమ్మ నుండి బాగా వంటబట్టాయని చెప్పాలి. తను భూస్వామ్య కుటుంబంలో పుట్టినా కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే మార్గాన్ని ఎంచుకుంది. అదే తత్వాన్ని మాక్కూడా నేర్పించింది. ఎప్పుడూ శ్రమను గౌరవించాలి అని చెప్తుండేది. అందుకే ఇప్పటికీ నేను కష్టంలో ఉన్న వారిని ఏదో ఒక రూపంలో ఆదుకుంటున్నాను. ముఖ్యంగా వైద్యం విషయంలో పేదలకు నాకు చేతనైనంత సాయం చేస్తుంటాను. ఆ తల్లి కడుపున పుట్టడం నాకు గర్వకారణంగా అనిపిస్తుంది. అసూయ, ఈర్ష్య లేకుండా ఇప్పటి వరకు నేను ఈ సమాజంలో నిలబడగలిగానంటే అది అమ్మానాన్న నుండి నేర్చుకున్నవే.
– కరుణ, స్వరాజ్యం కుమార్తె
అన్ని కోణాలలో ఆలోచించేది
నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మమ్మ ప్రభావం నాపై చాలా ఉంది. చదువుకునేటప్పుడు సెలవులు వస్తే చాలు అమ్మమ్మ, తాతయ్య దగ్గరకు వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళ జీవితాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వచ్చిపోయే జనాలు, వాళ్ళ కష్టాలు, అమ్మమ్మ వాళ్లు చెప్పే పరిష్కారాలు వింటూ పెరిగాను. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నన్ను పడుకోబెట్టడానికి బతుకమ్మ పాటలు పాడేది. పోరాట సమయంలో వారి అనుభవాలను మాకు కథలుగా చెప్పేది. నేను టీనేజ్‌కు వచ్చే సమయానికి అమ్మమ్మ ఐద్వాలో యాక్టివ్‌గా పని చేస్తుండేది. చాలా మంది మహిళలు అమ్మమ్మ దగ్గరకు వచ్చేవారు. అప్పుడు అమ్మమ్మలో మరో కోణాన్ని చూశాను. అప్పటి వరకు అమ్మమ్మ అంటే కేవలం మహిళల వైపే ఆలోచిస్తుంది, వాళ్ల కూలీ, వాళ్ల హక్కులు, మద్యపానం కోసం పోరాటం ఇవే చూశాను. అయితే మహిళల కష్టాలు తెలుసుకోవడమే కాకుండా వాళ్ల తప్పేమైనా ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేసేది. అంటే ఏదో బ్లయిండ్‌గా అమ్మమ్మ మహిళల పక్షం నిలబడలేదు. అన్ని విధాలుగా ఆలోచించి మాట్లాడేది. మహిళలు చాలా ధైర్యవంతులు, దేన్నైనా పరిష్కరించుకోగలరు అని నమ్మేది. ఆడవాళ్లకు కుటుంబం నుండి వచ్చే సమస్యలు పరిష్కరిస్తే మరింత ధైర్యంగా బతకగలరు అనేది. ఇవన్నీ నాపై ప్రభావం చూపాయి. ఏదైనా సమస్య వస్తే అన్ని కోణాల నుండి ఆలోచించడం, పరిష్కారం వెదకడం అలవాటుగా మారింది. పేదలు బాగుపడాలి, వారి జీవితాల్లో మార్పు రావాలి అని మాతో చెబుతుండేది. అమ్మమ్మ కుటుంబంలో ఒకలా, ప్రజా జీవితంలో ఒకలా లేదు. ప్రజలను ఎలా ప్రభావితం చేసిందో, మమ్మల్ని కూడా అలాగే ప్రభావితం చేసింది. నా పిల్లలపై కూడా అమ్మమ్మ ప్రభావం చాలా ఉంది.
స్రవంతి, స్వరాజ్యం మనుమరాలు
పోరాటాల స్ఫూర్తిప్రధాత
పెండ్లి చేసుకొని ఆ కుటుంబంలోకి వచ్చే నాటికి నాకు పెద్దగా చదువులేదు. తర్వాతనే చదివించారు. నన్ను వ్యక్తిగతంగా అభివృద్ది చేయడంలో అత్తమ్మ కృషి చాలా ఉంది. అమ్మ నవల ఇచ్చి చదవమన్నారు. రోజూ ప్రజాశక్తి పత్రిక కచ్చితంగా చదివేలా చూసేవారు. తనే స్వయంగా నా కాలేజీ ఫీజు కట్టేవారు. ప్రతి మహిళా ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలని అనేవారు. సాదాసీదాగా బతికేవారు. ఎప్పుడూ జనంలోనే ఉండేవారు. ఏ సమస్య తీసుకున్నా దాన్ని పరిష్కరించే వరకు వదిలేవారు కాదు. ముఖ్యంగా పేదల కోసం అహర్నిశలూ పని చేసేవారు. అది చూసి ఎంతో స్ఫూర్తిపొందాను. అన్ని విషయాల్లో నాకు సహకరించేవారు. నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడు అందరూ సపోర్ట్‌ చేశారు. పిల్లలు చిన్నగా ఉన్నారని పని చేయలేనేమో అంటే అత్తమ్మతో పాటు అప్పటి ఐద్వా నాయకు లు ఎంతో ప్రోత్సహించేవారు. అప్పట్లో ఆమె ఉమ్మడి ఆంధ్రాలో ఐద్వా కీలక పాత్ర పోషించే వారు. వెళితే వారం రోజుల వరకు ఇంటికి వచ్చేవారు కాదు. పోరాటాలకు ఓ స్ఫూర్తిప్రధా తగా నాకు కనిపించేవారు. అనేక మందిని తయారు చేసినటువంటి వ్యక్తి ఆమె. ఏమీ తెలియని అమాయక మహిళలను కూడా తిరగబడే విధంగా తీర్చిదిద్ది చైతన్యవంతం చేసిన నాయకురాలు అత్తమ్మ. ఆమె ఆశయ సాధనే మా లక్ష్యం.
– మల్లు లక్ష్మి, స్వరాజ్యం కోడలు.