జీవితం అంటే..?

జీవితం అంటే..?చాలామంది మనుషులు జీవితం అంటే ఏమిటో తెలుసుకోకుండానే జీవిత చరమాంకానికి చేరుకుంటారు. ఇలా కాకుండా మరొకలా జీవిస్తే బాగుండేదని యవ్వనం, నడిప్రాయం తరువాత చింతపడతారు. కానీ మనిషి అభిప్రాయాలతో సంబంధం లేకుండానే అనుభవాలతో జీవితం గడిచిపోతుంటుంది. ఈ విషయం తెలియకనే కొందరు ఎక్కడ మొదలవుతారో చివరకు అక్కడకే చేరుకుంటారు. జీవన గమనానికి సంబంధించిన స్పహ లేని ఫలితమే ఈ స్థితి. అసలు జీవితమంటే ఏమిటనే ప్రశ్నే ఎదురుకాదు చాలామందికి. ఎందుకంటే బతకడానికి కూడు, గూడు, గుడ్డ వంటి కనీస వసతుల కోసమే జీవితాంతం బండచాకిరీ చేస్తుంటారు.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది కొత్త విషయమేమి కాదు. కానీ మనుషులు ఎక్కడ మొదలయ్యారో తిరిగి తిరిగి అక్కడికే చేరుకోడమే వైచిత్రి. కొన్ని భ్రమలతో, ఆశలతో, తెలిసీ తెలియని కోరికలతో జీవితాన్ని మొదలెడతారు. చివరకు వచ్చేసరికి జీవితంలో ఏమీ లేదని తెలుసుకొని నిరుత్తరులవుతారు. బుచ్చిబాబు నవలలో ‘జీవితం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న దయానిధికి ఒక పజిల్‌గా మిగిలిపోతుంది. ఇదే ప్రశ్నని తన గురువు గారిని అడుగుతాడు అతడు. ఆయన ఒక కవర్‌ ఇచ్చి తాను చనిపోయాక తెరిచిచూడమని, అపుడు అతని ప్రశ్నకు జవాబు దొరుకుతుందని చెబుతాడు. ఆయన మరణానంతరం దయానిధి ఆ కవర్‌ తెరిచి చూస్తాడు. అందులో ఖాళీ కాగితం తప్ప ఏం ఉండదు. జీవితమంటే శూన్యమా అనుకుంటాడు. జీవితంలో ఏమీలేదు, శూన్యమనే మాట అంగీకరించడానికి మనసొప్పదు. జీవితమంటే ఏమిటనే ప్రశ్నని వెదికే క్రమాన దయానిధి జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ఇలాంటి విశేషాలు ఆ నవలలో చాలానే ఉంటాయి. కానీ, జీవితమంటే తెల్లకాగితంలా స్వచ్ఛంగా ఉండాలి.
మనం ఎంతగా ఆలోచిస్తే మన మెదడు అంతగా పనిచేస్తుంది. మన ఆలోచనల ప్రతిరూపమే మనం. మనలోని బలమైన ఆలోచనలకు మన జీవితమే అద్దం. మనకు విచక్షణా జ్ఞానం ఉంది కాబట్టి ఆలోచనలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఉద్దేశపూర్వకంగా మనసుతో ఆలోచించి జీవితాన్ని తీర్చిదిద్దుకోగల స్వేచ్ఛ మనకు ఉంది. ఆలోచనలు లేని మనిషంటూ ఉండడు.
చాలామంది మనుషులు జీవితం అంటే ఏమిటో తెలుసుకోకుండానే జీవిత చరమాంకానికి చేరుకుంటారు. ఇలా కాకుండా మరొకలా జీవిస్తే బాగుండేదని యవ్వనం, నడిప్రాయం తరువాత చింతపడతారు. కానీ మనిషి అభిప్రాయాలతో సంబంధం లేకుండానే అనుభవాలతో జీవితం గడిచిపోతుంటుంది. ఈ విషయం తెలియకనే కొందరు ఎక్కడ మొదలవుతారో చివరకు అక్కడకే చేరుకుంటారు. జీవన గమనానికి సంబంధించిన స్పహ లేని ఫలితమే ఈ స్థితి. అసలు జీవితమంటే ఏమిటనే ప్రశ్నే ఎదురుకాదు చాలామందికి. ఎందుకంటే బతకడానికి కూడు, గూడు, గుడ్డ వంటి కనీస వసతుల కోసమే జీవితాంతం బండచాకిరీ చేస్తుంటారు.
కేవలం తమ జీవితం గురించే కాకుండా, లోకం పోకడల్ని సైతం గమనిస్తే మనుషులుగా ఎలా మెలగాలో తెలుస్తుంది. ఇతరులకు వీలయినంత మేలు చేసే రీతిన తమ కాలం గడపటానికి ప్రయత్నిస్తారు. మంచికీ, మానవీయతకీ ప్రాధాన్యమిస్తారు. బాల్యం తెలియకుండానే గడచిపోతుంది. యవ్వనం, నడిప్రాయం, ముసలితనం మాత్రం స్పహలోనే ఉంటాయి. కనుక ఈ కాలాన తమ నడత, జీవనరీతి సవ్యంగా ఉండాలి. తమ వల్ల ఇతరులకు మేలు జరగక పోయినా పర్వాలేదు కానీ, కీడు మాత్రం జరగకూడదన్న తలంపు అవసరం. వీలయితే తమ మాటలు, చేతలు పరులకు ఉపయోగపడేలా ఉంటేనే మంచిది. ఈ దిశగా ఆలోచించినపుడే జీవితానికి అర్థం ఉంటుంది. పుట్టుక తమ చేతిలో లేకున్నా పెరిగే క్రమాన తమ మీద తాము పట్టు కల్గి ఉండాలి. తమ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఉద్వేగాలు తమకు హాయినివ్వగానే సరిపోదు, సమాజ హితానికి దోహదపడాలి. మహానీయుల జీవితాలు మనకు అదే నేర్పుతాయి. ఈ రీతిన జీవించేవారిని మరణానంతరమూ తర్వాతి తరాలు గుర్తు పెట్టుకుంటాయి. ఆయా కాలాల్లో వారి బతుకు, వారి ఆలోచనలు, వారి క్రియాశీలత సమాజ ఉన్నతికి చేసిన దోహదం గురించి తలపోస్తారు. అందుకే జీవితం ఒక పరిమళంలా, ఒక దీపస్తంభంలా పరివ్యాప్తమవ్వాలి.