అది మోడీ రాజకీయ కార్యక్రమం

– అయోధ్యలో మందిర ప్రారంభంపై రాహుల్‌
– హిందూ మత పెద్దలు ఇప్పటికే చెప్పేశారంటూ నర్మగర్భ వ్యాఖ్య
– మతాన్ని గౌరవిస్తా… కానీ ఒంటికి పులుముకోను
– సీట్ల సర్దుబాటు క్లిష్టమైనదేమీ కాదు
– ప్రధాని మణిపూర్‌ వెళ్లకపోవడం సిగ్గుచేటు
కోహిమా: ఈ నెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ‘నరేంద్ర మోడీ రాజకీయ కార్యక్రమం’గా మార్చేశాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనడం కాంగ్రెస్‌కు కష్టమవుతోందని ఆయన చెప్పారు. భారత్‌ జోడో న్యాయ యాత్ర చేపట్టిన తర్వాత రాహుల్‌ నాగాలాండ్‌లో తొలిసారిగా విలేకరులతో ముచ్చటించారు. యాత్రలో భాగంగా అయోధ్యలో రామమందిరాన్ని సందర్శిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవాన్ని నరేంద్ర మోడీ రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అందుకే ఈ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని మా పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు’ అని రాహుల్‌ నాగాలాండ్‌లోని చిచామాలో చెప్పారు. తాము అన్ని మతాలను, వాటి విశ్వాసాలను గౌరవిస్తామని తెలిపారు. అయోధ్యలో జరిగే కార్యక్రమం గురించి హిందూ మత పెద్దలు కూడా తమ అభిప్రాయాలు తెలియజేశారంటూ పరోక్షంగా శంకరాచార్యుల వ్యాఖ్యలను ప్రస్తావించారు. రాముడి కేంద్రంగా సాగాల్సిన వేడుక ప్రధాని చుట్టూ తిరగడం తమకు కష్టంగా ఉన్నదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కానీ, భాగస్వామ్య పక్షాల వారు కూడా అయోధ్య కార్యక్రమానికి హాజరవ్వాలని అనుకుంటే వెళ్లవచ్చునని చెప్పారు. ‘ఆయన మతాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటారు. మతంతో సంబంధాలు కొనసాగించాలని కోరుకునే వారు దాని నుంచి ప్రయోజనం పొందాలని భావిస్తారు. దానిపై నాకేమీ ఆసక్తి లేదు. నేను మత సిద్ధాంతాల ఆధారంగా జీవించేందుకు ప్రయత్నిస్తాను. నేను ప్రజలతో మంచిగా ప్రవర్తిస్తాను. వారిని గౌరవిస్తాను. ఎవరైనా నాకు ఏమైనా చెప్పాలని అనుకుంటే అహంకారం ప్రదర్శించను. వారు చెప్పేది వింటాను. విద్వేషాలు వ్యాపింపజేయను. నాకు సంబంధించినంత వరకూ ఇదే హిందూ మతం. నేను జీవితంలో దీనిని అనుసరిస్తాను. అయితే నేను దానిని నా శరీరంపై కప్పుకోవాల్సిన అవసరం లేదు. దానిపై నమ్మకం లేని వారే మతాన్ని ఒంటిపై పులుముకుంటారు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి సన్నద్ధంగా ఉన్నదని రాహుల్‌ అన్నారు. తాను చేపట్టిన యాత్ర సైద్ధాంతికమైనదని, దేశంలో చోటుచేసుకుంటున్న అసమానతలు సహా అది అనేక సమస్యలను ముందుకు తెస్తుందని చెప్పారు. తన యాత్ర దేశానికి ప్రత్యామ్నాయ కోణాన్ని అందిస్తుందని తెలిపారు. ఇండియా కూటమిలో ఇప్పటి వరకూ సీట్ల సర్దుబాటు కుదరకపోవడం, భాగస్వామ్యపక్షాలు అంగీకారానికి రాలేకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ దీనిపై కసరత్తు జరుగుతోందని, అదేమంత క్లిష్టమైనది కాదని అన్నారు. సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్చలు ఎక్కడ ముగుస్తాయో చూడాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో యాత్రను ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ ‘అక్కడ ఎంతో అన్యాయం జరిగింది. ప్రజల ప్రాణాలు, ఆస్త్తులు పోయాయి. తొలిసారిగా దేశంలోని ఓ రాష్ట్రంలో నెలల తరబడి హింసాకాండ కొనసాగింది. బీజేపీ నేతలు కానీ, ప్రధాని కానీ ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. మణిపూర్‌కు ప్రధాని ఇప్పటి వరకూ వెళ్లకపోవడం విచారకరం, సిగ్గుచేటు వ్యవహారం’ అని రాహుల్‌ తెలిపారు.