అది మా కష్టమే…

– కేంద్ర అనుమతులపై మాజీ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవిశ్రాంత కృషి చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. రక్షణ శాఖ భూముల కోసం తమ పాలనలో అలుపెరగని పోరాటం చేశామనీ, ప్రధాని సహా కేంద్ర మంత్రులకు పదుల సంఖ్యలో వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి, అనుమతులు ఇచ్చిందనీ, దీనికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అనుమతులు వచ్చినా, ఇది ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన విజయమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం కేంద్రానికి రాసిన పలు లేఖల్ని ఉటంకించారు.