అలనాటి మా పల్లె పచ్చని ప్రకతి కోక కట్టి
బాగా ముస్తాబై కూర్చుంటుంది
గుబురు పొదల ఒడిలో
వెచ్చగా హాయిగా ఒదిగిపోతుంది
మట్టి పరిమళాల్ని
ఒళ్ళంతా పూసుకుని గుభాళిస్తుంది
పచ్చని మొక్కల మొదళ్ళను
మనసారా హత్తుకుని పరవశిస్తుంది
తొలి కోడి కూతతో నిద్రలేచి
కల్లాపి చల్లి రంగవల్లుల్ని పూయిస్తుంది
ముగ్గుల పువ్వుల్ని తన కొప్పులో
చిరునవ్వుతో తురుముకుంటుంది
లేగ దూడల్తో గట్లపై ఆడుకుని
నాగలకట్టపై సేద తీరుతుంది
సాయం సంధ్యలో గుడి గంట కొట్టగానే పంట పొలాలకు హారతి పడుతుంది
దిష్టి బొట్టు పొలిమేర నుదుట పెట్టి ఊరి జనాల్ని తన పొత్తిళ్ళలో దాస్తుంది
పచ్చిక బయలు తివాచీ పరచి ఆటల్లో కాలాన్ని కూడా మరచిపోతుంది
కొమ్మ కొమ్మలో ఊయలలూగుతూ చెట్టు చేమతో కలిసి ఆటాడుకుంటుంది
పొడిచే పొద్దును మస్తకమున బొట్టుగా పెట్టి
నెలవంకతో ఎంచక్కా చెలిమి చేస్తుంది
పాలేగాళ్ళ పాటల్లో తను రాగమై చేను సెలకల సాగులో మునకలేస్తుంది
నాగలై ముద్దాడుతూనే చెట్టుకు పురుడొస్తుంది
పండుగలొస్తే పాదాలకు పారాణి రాసుకుని
పేరంటానికి సిద్ధమై కూర్చుంటుంది
పల్లె పడుచుల నవ్వుల్ని దోసిట్లో నింపుకుని
అక్షింతలుగా తలపై తనే చల్లుకుంటుంది
చుట్టూ చెట్లు కొమ్మల కరచాలనంతో
ఇంద్రధనస్సులా రంగుల్ని పులుముకుంటుంది
అలనాటి మా పల్లె బంగారు కొండ ఎల్లప్పుడూ వికసిస్తూనే వుంటుంది
నవ్వులు పూయిస్తూనే వుంటుంది
ఇప్పుడు అనగనగా అంటూ
కథల్లో కనిపిస్తూనే ఆనాటి జ్ఞాపకాల్లో మునకలేయిస్తుంది
– నరెద్దుల రాజారెడ్డి, 9666016636