ఐసీసీ ఈవెంటా అది?

Is that the ICC event?– బీసీసీఐ ఈవెంట్‌లా దాయాదుల పోరు
– భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై మికీ ఆర్థర్‌
అహ్మదాబాద్‌ (గుజరాత్‌) : ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ ముఖాముఖి పోరు ముగిసింది. సరిహద్దుకు ఇరువైపుల అభిమానులు, ప్రజలతో పాటు క్రికెట్‌ ప్రపంచం చూపును తనవైపుకు తిప్పుకున్న దాయాదుల పోరులో ఆతిథ్య టీమ్‌ ఇండియా అలవోకగా గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఐసీసీ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై అజేయ రికార్డును 8-0కు మెరుగుపర్చుకుంది. ఐసీసీ 2022 టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరు క్రికెట్‌ ప్రపంచానికి సరికొత్త అనుభూతిని మిగిల్చింది. ఛేదనలో మొనగాడు విరాట్‌ కోహ్లి అసమాన ఇన్నింగ్స్‌తో నరాలు తేగే ఉత్కంఠకు దారితీసిన మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. అటువంటి అనుభవం, అనుభూతినే అహ్మదాబాద్‌లో ఆశించిన అభిమానులు.. టీమ్‌ ఇండియా మూడు రంగాల్లోనూ ఎదురులేని ప్రదర్శన చేయటంతో ఆ మజాకు దూరమయ్యారు!. శనివారం జరిగిన భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు లక్షకు పైగా అభిమానులు స్టేడియానికి వచ్చారు. అందులో ‘ముగ్గురు’ మాత్రమే పాకిస్థాన్‌ అభిమానులు కాగా అందరూ ఆతిథ్య భారత్‌ వీరాభిమానులే కావటం విశేషం. స్టేడియంలో ఇరు జట్ల అభిమానుల హాజరులో లోపించిన భిన్నత్వంపై పాకిస్థాన్‌ టీమ్‌ డైరెక్టర్‌ మికీ ఆర్థర్‌ స్పందించారు. ‘లక్ష మందికి పైగా అభిమానులు ఉన్న మొతెరా స్టేడియంలో పాకిస్థాన్‌ అభిమానులు లేకపోవటంతోనే ఓటమి చెందామంటే అది అబద్ధం అవుతుంది. అభిమానులు లేకపోవటం ఆటపై ప్రభావం చూపిందని అనబోను. కానీ నాకు ఇది ఐసీసీ ఈవెంట్‌, మ్యాచ్‌ లాగా ఏమాత్రం అనిపించలేదు. ద్వైపాక్షిక సిరీస్‌, బీసీసీఐ సొంత ఈవెంట్‌ మాదిరిగా అనిపించింది. స్టేడియంలో వినిపించిన సంగీతం సైతం పాకిస్థాన్‌ ఆటగాళ్లకు పూర్తిగా కొత్త. అభిమానులు ఉండటం అదనపు బలం అనగలను కానీ.. అభిమానులు లేకపోవటం ఓటమికి కారణమని చెప్పలేను’ మికీ ఆర్థర్‌ అన్నాడు.
ఇదిలా ఉండగా, భారత్‌ చివరగా 2011, 2016లో ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం అందించింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ మీడియా, అభిమానులకు వీసాలు లభించాయి. 2011 ఐసీసీ ప్రపంచకప్‌ భారత్‌, పాకిస్థాన్‌ సెమీఫైనల్‌కు 6500 మంది పాకిస్థాన్‌ అభిమానులకు వీసా లభించింది. ఈసారి పాకిస్థాన్‌ నుంచి 355 మంది స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌లు వీసాకు దరఖాస్తు చేసుకోగా కేవలం ముగ్గురికి మాత్రమే వీసా మంజూరు చేశారు. అమెరికన్‌ పాకిస్థాన్‌కు చెందిన అభిమానులు బషీర్‌ చాచా సహా ముగ్గురికి సైతం వీసా లభించింది.