– మాజీ మంత్రి పొన్నాల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్‌లో బీసీలకు ఏ మాత్రం గౌరవం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన తనతోపాటు డీ. శ్రీనివాస్, కే.కేశవరావు బయటికొచ్చామని తెలిపారు. దీన్నిబట్టే కాంగ్రెస్‌లో బీసీల పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్… మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేకపోయిందని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ఆ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత… ఇప్పుడు అనేక పార్టీలు ఓబీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాయని గుర్తు చేశారు. అంతకంటే ముందే రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. తాను ఎలాంటి పదవులూ ఆశించి బీఆర్‌ఎస్‌లోకి రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు కాంగ్రెస్‌లో గౌరవం దక్కలేదనీ, ఆ గౌరవం కోసమే తాను ఆ పార్టీని వీడానని పొన్నాల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.