– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లో నివసించే వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావడం, అక్కడ ఓటు వేసేందుకు వారు తరలి వెళ్లడంతో ఇక్కడ పోలింగ్ శాతం తగ్గిందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమాేశాన్ని నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో మార్పు మొదలైందనీ, మోడీ నాయకత్వాన్ని తెలంగాణ కోరుకుంటున్నదని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ఈ దఫా ఎన్నికల్లో గ్రామాల్లో కూడా బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మలేదని విమర్శించారు. మెజార్టీ ఓటర్లు మోడీవైపే మొగ్గు చూపారన్నారు.
షేక్‌పేట్ డివిజన్ పరిధిలో దాదాపు 3 వేల ఓట్లను డిలీట్ చేశారనీ, ఒక వర్గానికి చెందిన ఓట్లను మాత్రమే డిలీట్ చేయడం దుర్మార్గమని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు గల్లంతైన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజవర్గంలో కొంతమంది అధికారులు ఒక పథకం ప్రకారం ఒక వర్గం వారి ఓట్లను డిలీట్ చేశారని ఆరోపిం చారు. డిలీట్ అయిన వారందరూ అనేక సంవత్సరాలుగా ఇక్కడే ఓటింగ్‌లో పాల్గొంటున్నారనీ, ఇక్కడే సొంత ఇండ్లు ఉన్నాయని తెలిపారు. కొందరు ఉద్యోగస్తులు కూడా ఉన్నారని గుర్తుచేశారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారికి, సికింద్రాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, వారు దర్యాప్తు చేపడతామని హమీ ఇచ్చారన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. పట్టణ ఓటర్లను సంస్కరించాల్సిన అవసరముందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి మున్సిపల్ అధికారులు తొలగించడం లేదని ఆరోపించారు. తన కుటుంబంలోనే తన ఓటు, తన కుమారుని ఓట్లు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోడీని విమర్శించే ముందు సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. గ్యారంటీలు అమలు చేయకుండా మాట్లాడటం ఆయనకే చెల్లిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఎంత రెచ్చగొట్టినా తమ కార్యకర్తలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. రాబోయే ఫలితాల్లో రాష్ట్రంలో బీజేపీ కొత్త శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా చోట్ల బీఆర్‌ఎస్‌కు ఏజెంట్లు లేరనీ, ఉన్నచోట ఏజెన్సీకి చెందిన వారిని ఏజెంట్లుగా పెట్టుకున్నారని తెలిపారు. చాలా చోట్ల మజ్లిస్ కార్యకర్తలు కాంగ్రెస్ కోసం పని చేశారన్నారు.