ఆ తీర్పు నిజమే…

ఆ తీర్పిచ్చి వందేళ్ళయింది. తీర్పు చెప్పింది రంజన్‌ గొగోయో, ధనుంజయ్‌ చంద్రచూడో కాదు. ఆర్నాట్‌! రెండు శతాబ్దాలు మన దేశాన్నేలిన ఇంగ్లండ్‌కు చెందినోడు ఆ జడ్జి. ”కింగ్‌ ఎంపరర్‌ వర్సెస్‌ రంప పితూరి” అని పిలువబడే మన్యం తిరుగుబాటు దారు లపై బ్రిటీష్‌ ప్రభుత్వం నడిపిన కుట్ర కేసులో వాల్తేరులోని ఏజెన్సీ డివిజన్‌ అదనపు జిల్లా జడ్జీ. 1923 జూన్‌ 25 న తాను ఇచ్చిన తీర్పులో ‘గొప్ప’ చారిత్రక సత్యాన్ని తెలిపాడు. ”ప్రజా పోరాటాలు తమ రాజ్యాధికారాన్ని ఎంతవరకు ప్రశ్నిస్తున్నా యన్న విషయం తప్ప, పాలకులకు ఆ పోరాట కారణాలతో నిమిత్తం లేదు”.
ప్రభుత్వరంగ పరిశ్రమలను రక్షించాలని ఆ పరిశ్రమల కార్మికులు పోరాడినా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థల పరిరక్షణకు ఆ సంస్థల ఉద్యోగులు పోరాడినా నేటి పాలకులు ”విధానాలతో మీకేం సంబంధం? మీకేమైనా జీతా లు పెంచాలంటే అడుక్కోండి” అని డైరెక్ట్‌గా బెదిరిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఈ విధమైన డైలాగులు మొన్నటి రైతు ఉద్యమం సందర్భంగా మోడీ శిష్యబృందమంతా విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలొచ్చాయి. టీవీ చర్చల్లో ప్రభుత్వ తాబేదార్లంతా చర్చ లతో హోరెత్తించారు. రైతుల ఉద్యమంలో రాజకీయాలు చొర బడ్డాయని, ప్రభుత్వ విధానాన్ని రైతులెలా ప్రశ్నిస్తారని ఊదరగొట్టారు.
మొన్ననే జలంధర్‌లో ఎస్‌.కే.ఎమ్‌ (సంయుక్త కిసాన్‌ మోర్చా) జాతీయ సదస్సు జరిగింది. 510 సంఘాల జాతీయ వేదిక ఎందుకేర్పడిందో, వారి డిమాండ్లు ఎందుకొచ్చాయో, వాటి కారణా లేమిటో మోడీ అండ్‌ కోకు అనవసరం. అసలు దేశంలో వ్యవసాయ సంక్షోభం మూల కారణాలేమిటో వాటి పుట్టు పూర్వోత్తరాలు మన పాలకులకు పట్టదు. రైతు ఆత్మహత్యల పరంపర గత శతాబ్ది చివర్లో ప్రారంభమై. నేటిదాకా ఎందుకు కొనసాగుతోందో ఆ కారణాలతో మన పాలకులకు నిమిత్తం లేదు. మూడు వ్యవసాయ చట్టాలను తమ మంద బలంతో ప్రతిపక్షం నోరునొక్కి మరీ ఎందుకు ప్యాస్‌ చేసుకున్నారో చెప్పరు పాలకులు. అసలు ప్రతిపక్షమే పార్లమెంటులో లేనపుడు నాలుగు కార్మిక కోడ్‌లను ఆమోదింప చేసుకోవడం, తప్పు… తప్పు… చేతులెత్తించేసుకోవడం మోడీ సర్కార్‌ ఎందుకు చెయ్యా ల్సొచ్చిందో చెప్పగలదా? దేశ జనాభాలో దాదాపు సగం మందికి పైగా జీవితాలను దెబ్బతీసి వారిని బానిస బతుకుల్లోకి నెట్టే ప్రయత్నమిది. కారణం ఏమిటి? ఎవరిని మోయడానికి? దేశంలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
జలియన్‌ వాలా బాగ్‌ ఉదంతం దేశ ప్రజానీకంలో రక్తం ఉర కలెత్తేలా చేసింది. జనరల్‌ డయ్యర్‌లు మాకూ ఉన్నారని రుజువు చేసింది మోడీ సర్కార్‌. రైతాంగ ప్రదర్శనపై కారు నడిపి లక్కిం పూర్‌ ఖేరిలో నల్గురు రైతు ఉద్యమ కారుల్ని, ఒక ఫొటో జర్నలిస్టు జీవితాన్ని చిదిమేసిన వ్యక్తి సాక్షాత్తు కేంద్ర మంత్రి కుమార రత్నం. ఘటన జరిగి రెండేండ్లు గడిచిపోయినా అటు కేసూ పురోగమించదు. ఇటు కేంద్ర మంత్రి వర్గంలో నుండి అజయ్‌ మిశ్రాను మోడీ తొలగించడు. మొన్న జరిగిన ఎస్‌.కే.ఎమ్‌ సదస్సు ఆ మంత్రిని తొలగించాలన్న తన డిమాండును పునరుద్ఘాటించింది. ఈ సదస్సు కీలకమైన కార్మిక డిమాండ్లతో పాటు వ్యవసాయ కార్మికులకు ఉపాధిహామీ చట్టం కింద సంవత్సరానికి 200 పని దినాలుండాలని కూడా డిమాండు చేసింది. నేడు రైతాంగ మరో కీలక డిమాం డు విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని. ఇది దేశంలోని కోట్లాది సామాన్యులకు మేలు చేసే చర్య. విద్యుత్‌ రంగ ప్రయి వేటీకరణే జరిగితే అంబానీ, టాటా వంటి వారి జేబులు నిండటమే కాదు కోట్లాది మంది సామాన్యుల బతుకులు చీకట్ల పాలౌతాయి.
ఈ పరిస్థితి శాశ్వతం కారాదు. పాలకులు అంత బరితెగించి నపుడు చేతకానిది ప్రజలకేనా? దేశంలో గతంలో ఎప్పటికంటే శ్రమజీవులంతా ఐక్యమవుతున్నారు. పెట్టుబడిపై పోరుకు లంగోటాలు బిగించి, గోదాలోకి దిగారు. రిపబ్లిక్‌ డే రోజు ట్రాక్టర్ల పరేడ్‌కు, ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌కు ఉద్యుక్తులవుతున్నారు. అదే రోజు కార్మికులు దేశ వ్యాపిత ఆందోళనకు పిలుపునిచ్చారు.
1923 అదనపు జిల్లా జడ్జీ తీర్పు నేటి పరిస్థితికి దర్పణం. ”జరిగే విషయాలను అర్థం చేసుకోవాలంటే, వర్తమాన వర్గపోరా టంతో మాత్రమే ప్రారంభించాలి. ఇంక ఏ విధంగా చరిత్రను అధ్యయనం చేసే క్రమమైనా గతించిన సంఘర్షణలతో గెలు పొందిన వారి ప్రభావానికి గురికాక తప్పదు. ఈ గత సంఘర్షణల శ్మశానాలలో కూచునే మన విశ్వవిద్యాలయ అకడమిక్‌ రాబందులు చరిత్రపేరుతో పాలకవర్గాల పుక్కిటి పురాణాల్ని ప్రచారం చేస్తున్నారం”టాండు సి వి సుబ్బారావు.