
– ఆనందంలో వార్డు ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామంలో 10వ వార్డులో 2018 సంవత్సరంలో రోడ్డుపై విరిగిపోయిన మోరికి గురువారం అర్ధరాత్రి మోక్షం కలిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య గురువారం రాత్రి రోడ్డుపై మోరి వేయించి ఎర్ర మొరంతో తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మాణం యుద్ధపాదికన పనులు చేయించారు. దీంతో వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఐదేళ్లుగా నోచుకోని వైనం
10వ వార్డులో మోరి విరిగిపోయి, రోడ్డు, డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారవడంతో, ప్రజలు రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటే ఏ క్షణంలో ఏ ప్రమాదాలు సంభవిస్తాయోని భయాందోళనకు గురైయ్యేవారు.విరిగిన మోరి, రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేయాలని పంచాయతీ పాలకవర్గానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన.ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం పదవులకు గురువారం కాలం చెల్లింది.ఇక 10వ వార్డులో అభివృద్ధి పనులు చేసే నాథుడు లేడా అనుకున్న క్రమంలో నేనున్నానంటూ ఆ గ్రామం నుంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న బడితేల రాజయ్య మంత్రి దుద్దిళ్ల ఆదేశాల మేరకు గురువారం అర్ధరాత్రి అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజల ఆనందం అంతుచిక్కలేదు.గుంతలమయమైన రోడ్లను ఎర్ర మొరంతో తాత్కాలిక రోడ్లు వేయడంపై ప్రజలు రాజయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.