ప్రముఖుల బయోపిక్స్‌లో అలాగే ఛాలెంజింగ్‌గా ఉండే నిజ జీవిత పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతంఆహా కోసం ఓ సీరిస్ చేస్తున్నా.
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తొలిసారి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. పి.సముద్రఖని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన కథానాయిక కేతిక శర్మ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘బ్రో మాతక చూశాను. దానితో పోలిస్తే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే కథానాయిక పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది. వినోదంతో పాటు పలు హంగులు జోడించి మాతక కంటే మరింత అందంగా మలిచారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధానం కారణం పవన్ కళ్యాణ్. ఆయన పేరు వింటే చాలు.. సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. అయితే ఆయన కాంబినేషన్‌లో నాకు సన్నివేశాలు లేవు. కానీ ఆయనతో కలిసి సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. అంతేకాదు మొదటిసారి ఈ సినిమా ద్వారానే ఆయన్ని కలిసే అవకాశం లభించింది. ఈ సినిమాలో నేను సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్న మార్క్‌కి ప్రేయసిగా కనిపిస్తాను. ఇది సినిమాకి ముఖ్యమైన, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. ఆసక్తికర కథాకథనాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా సాగుతుంది. ఇదొక సందేశాత్మక చిత్రం. ఈ తరహా సినిమాలో నటించే అవకాశం రావడం నాకు ఇదే మొదటిసారి. నా గత చిత్రాలతో పోలిస్తే ఇది విభిన్న చిత్రం’ అని చెప్పారు.