– జీవో 142 రద్దు రాష్ట్ర స్ట్రగుల్ కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచేందుగాను మానవ వనరులను హేతుబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 142 లోప భూయిష్టంగా ఉందని ఆ జీవో రద్దు పోరాట కమిటీ సభ్యులు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని జ్యోతిరావు ఫూలే భవనంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని నోడల్ అధికారికి అందజేశారు. ప్రజలకు, వైద్యారోగ్యరంగానికి గొట్టలిపెట్టుగా ఉన్న ఈ జీవోపై గత ప్రభుత్వంపై ఒత్తిడి తేగా తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపారు. ఇటీవల కొంత మంది అధికారులు ప్రస్తుత ప్రభుత్వంతో ఆ జీవోను అమలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఈ జీవను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మానవ వనరుల హేతుబద్ధీకరణను జనాభా ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన వైద్యారోగ్య సేవలు అందించడం కోసమే చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్ ఏకపక్షంగా ఆ జీవోను విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,618 పోస్టులను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.
ఆ శాఖలో 142 జీవో ద్వారా సివిల్ సర్జన్ స్పెషలిస్టులుగా ఉన్న పోస్టులను సూపర్ న్యూమరిగా పెట్టారని తెలిపారు. రాష్ట్ర మాజీ ఉన్నతాధికారి తనకు సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్లను సీనియార్టీతో సంబంధం లేకుండా జిల్లాలకు డీఎంహెచ్ వోలుగా ఏడీపీహెచ్‌ఓగా నియమించడం సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకమని తెలిపారు. అంతే కాకుండా నూతన జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయంలో మాత్రం నూతన పోస్టులు క్రియేట్ చేయక పోవడంతో సరి కాదన్నారు. పారా మెడికల్ సిబ్బంది పోస్టులను ఎత్తివేయడం, సిహెచ్‌వోలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ చేసిన హెల్త్ ఎడ్యుకేటర్లను పరిగణనలోకి తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా వివిధ క్యాడర్లను ఇష్టానుసారంగా విభజించారని ఫిర్యాదు చేశారు. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ స్పందిస్తూ ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ కార్యదర్శి దష్టికి తీసుకెళ్లి సమస్యని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో జీవో 142 రద్దు స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర నాయకులు బానోతు నెహ్రూచంద్, కె.యాద నాయక్, కొప్పు ప్రసాద్, టి.మాధవ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పసియుద్దిన్ తదితరులున్నారు.