మహిళా చట్టంలో ఆ భాగాన్ని కొట్టివేయలేం

– నోటీసు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
– జనగణన తర్వాతే అమల్లోకి…
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ చట్టంలోని ఓ భాగాన్ని కొట్టివేయడం కష్టమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. జనగణన తర్వాతే ఈ చట్టం అమలులోకి వస్తుందని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల లోగా లోక్‌సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నోటీసు జారీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ పెండింగులో ఉన్నదని, ఠాకూర్‌ అభ్యర్థనను ఈ నెల 22న పరిశీలిస్తామని న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన బెంచ్‌ తెలిపింది. ఠాకూర్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినేందుకు సుప్రీం బెంచ్‌ నిరాకరించింది.