– పథకం రద్దైన ఇవ్వని డబ్బులు
– ఏళ్లుగా ఎదురు చూపులే
– మండలంలో 2,615మంది లబ్ధిదారులు
నవతెలంగాణ-మల్హర్‌రావు
అభయహస్తం పథకం నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య పెన్షన్‌తో సంబంధం లేకుండా అభయ హస్తం కింద పెన్షన్ అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సభ్యురాలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లించే విధంగా రూపకల్పన చేసింది. గతేడాది ఈ పథకాన్ని రద్దు చేస్తూ మహిళలకు రావాల్సిన డబ్బులు అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పరిస్థితిలో తాము చెల్లించిన అభయహస్తం డబ్బులు తిరిగి ఇస్తారా లేదా.. ? అంటూ మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా 60,449మంది ఉండగా మల్హర్‌రావు మండల వ్యాప్తంగా ప్రస్తుతం 2,615మంది మహిళ సభ్యులు ఉన్నారని అధికారులు తేల్చారు. ఇందులో తాడిచెర్లలో 934, ఆన్‌సాన్‌పల్లిలో 98, రుద్రరంలో 224, మల్లారంలో 267, కొండంపేటలో 211, వళ్లెంకుంటలో 116, నాచారంలో 124, పెద్దతూండ్లలో 295, చిన్నతూం డ్లలో 256, ఎడ్లపల్లిలో 90మంది ఉన్నారు. గతంలో సభ్యులుగా చేరి 60 ఏళ్ళు నిండిన 182 లబ్ధిదారులకు నెలనెలా పెన్షన్ కూడా అందజేస్తున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం తరువాత నుంచి సభ్యుల నుంచి ప్రభుత్వం ప్రీమియం సొమ్మును వసూలు చేయలేదు.మహిళ సంఘాల సభ్యుల పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లకు, మరణానంతరం ఇచ్చే పరిహారం సొమ్మును కూడా నిలిపివేసింది. అభయ హస్తం పథకంలో పెన్షన్ పొందుతున్న వారిలో 65 సంవత్స రాలు నిండిన చాలా మందికి ఆసరా పెన్షన్ రూ.2.016 అందుతోంది. అభయహస్తం పెన్షన్ సొమ్మును 2018 ఏప్రిల్ నుంచి పూర్తిగా నిలిపివేశారు.
రద్దుతో పలు అనుమానాలు..
స్పష్టత ఇవ్వకుండానే అభయహస్తం పథకాన్ని రద్దు చేయడంపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ నిధులను తమకు తిరిగి చెల్లిస్తారా లేదాని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 36 ప్రకారం రెండేళ్లు వరసగా ప్రీమియం కట్టించుకోనట్లైతే సభ్యురాలు ఖాతా రద్దువుతుంది.అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వం ప్రీమియం కట్టించుకోవడం లేదు.ఇదే టైం లో వీరి నుంచి ఇంతకాలం సేకరించిన ప్రీమియం నిధుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ప్రయోజనాలు ఇలా…
ఈ పథకంలో చేరేందుకు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారిని అర్హులుగా నిర్ణయించారు. పదేళ్ళపాటు చెల్లిస్తే 60 ఏళ్ళ వయసు నిండిన తరువాత నెలకు రూ.500 నుంచి రూ.2.200 వరకు పెన్షన్ అం దించేలా ఏర్పాట్లు చేశారు.ఎవరైనా సభ్యులు చనిపోతే సహ జ మరణానికి రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75వేలు చెల్లిస్తారు.దహన సంస్కారాలకు తక్షణ సహాయంగా రూ.5వేలు అందిస్తారు.స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండి బీమా ప్రీమియం చెల్లించిన వారి పిల్లలు (ఇద్దరికి) చదువుకుంటే ఉపకార వేతనాలు అందిస్తారు.8,9,10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ. 1,200 చొప్పున ఉపకార వేతనాన్ని అందిస్తారు.దీంతో ప్రారంభంలో మహిళలు పథకంలో చేరేందుకు ఆసక్తి చూపారు.
లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ చేశాం
మండలంలోని అభయహస్తం వివరాలను సేకరించి వారి బ్యాంక్ ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేశాము.డబ్బులు అందజేయడం అనేది ప్రభుత్వ పాలసీ ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలైన వెంటనే వీరి ఖాతాల్లో జవుతాయి.
-ఎంపీఎం కమల