– అద్భుతంగా భారత బౌలింగ్
– పేసర్లు, స్పిన్నర్ల కలల ప్రదర్శన
– అభిమానులకు కన్నుల పండుగ
స్వింగ్, సీమ్, టర్న్… గాల్లో ఎగిరే వికెట్లు. ప్రపంచకప్‌లో భారత బౌలర్ల ప్రదర్శన కన్నుల పండుగ. పేసర్లు బుమ్రా, షమి, సిరాజ్.. స్పిన్నర్లు కుల్దీప్, జడేజాలు కలిసికట్టుగా వికెట్ల వేటలో చెలరేగుతున్నారు. ప్రపంచకప్ గ్రూప్ దశలో టీమ్ ఇండియా బౌలర్లకు ఇప్పటి వరకు ఎదురులేదు. ప్రత్యర్థి జట్ల బౌలింగ్ బృందాలకు అందనంత ఎత్తులో నిలిచిన టీమ్ ఇండియా బౌలర్లు.. వన్డే పండుగకు సరికొత్త కళ తీసుకొచ్చారు. బ్యాటర్లు రాజ్యమేలే ఫార్మాట్‌లో.. బౌలర్ల నైపుణ్యం చాటుతూ అబ్బురపరుస్తున్నారు.
నవతెలంగాణ క్రీడావిభాగం
క్రికెట్‌ను ఆస్వాదించటం అంటే.. బ్యాటర్ల విన్యాసాలకు చిందులు వేయటమే!. బ్యాటర్లు సిక్సర్లు సంధించినప్పుడు బ్యాట్ నుంచి వచ్చే ఆ స్ట్రోక్ సౌండ్ సైతం అభిమానులకు వినసొంపుగా ఉంటుంది. స్టాండ్స్‌లో బంతి పడితే చూసేందుకు రెండు కండ్లు చాలవు. ప్రత్యేకించి స్టాండ్స్ నుంచి మ్యాచ్‌ను చూసినప్పుడు బ్యాటర్లు మెరిసి, భారీ స్కోర్లు నమోదైతే అభిమానులకు అది విందు భోజనమే. బ్యాటింగ్‌లో శిఖర స్థాయి.. శతకం. బ్యాటర్ 90 పరుగులకు చేరువ కాగానే హంగామా మొదలవుతుంది. అతడు 100 పరుగులు పూర్తి చేస్తే అదో సంతృప్తి, ఆనందం, అనుభూతి. మ్యాచుల్లో, టోర్నీల్లో బౌలర్లే విజయాలు అందిస్తారు, కానీ క్రికెట్‌ను నడిపించే ఇంధనం మాత్రం పరుగులే. అటువంటిది ఐసీసీ 2023 ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుండగా, బ్యాటర్లను ఆరాధించే దేశంలో ఒక్కసారిగా బౌలర్లు సెంటర్ స్టేజ్‌కు రావటం అద్భుతమే. షమి, సిరాజ్, బుమ్రా, కుల్దీప్, జడేజాలు ఆ అద్భుతమే ఆవిష్కరించారు.
సంక్లిష్ట కళ
క్రికెట్‌కు ఎక్కువగా ఇష్టపడేది బ్యాటింగ్ కోసమే!. మన బౌలర్లు వికెట్లు కూల్చినప్పుడు సంబురపడతామే కానీ.. ఆ కళను పెద్దగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయం. బౌలర్ కళ రెప్పపాటులో ముగుస్తుంది. వికెట్ పడినప్పుడు మినహా పెద్దగా బౌలర్‌కు ఘనత ఆపాందించరు. బ్యాటర్ మరీ ఆడలేని బంతులను కొన్నిసార్లు హైలైట్ చేస్తారు. కానీ ఓ బ్యాటర్‌ను బుట్టలో వేసుకునేందుకు బౌలర్ వేసే ప్రణాళికలు, బ్యాటర్‌ను తన వ్యూహంలోకి తీసుకొచ్చి ఆడించే విధానం అభిమానులు పెద్దగా పట్టించుకోరు. మనం క్రికెట్‌ను అర్థం చేసుకునే పరిణితిలోనూ ఇది పెద్దగా కనిపించదు. కొందరు మాత్రం ఈ కళను అమితంగా ఇష్టపడుతూ ఆరాధిస్తారు. అటువంటి వారికి మధురానుభూతి మిగుల్చుతున్నారు టీమ్ ఇండియా బౌలర్లు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లను వలలో వేసుకుని, పక్కా ప్రణాళికతో పడగొడుతున్న తీరు అమోఘం. నిజానికి ఈ ప్రపంచకప్‌లో భారత బౌలర్ల ప్రదర్శన ప్రత్యక్షంగా వీక్షించటం సైతం ఓ అరుదైన గౌరవమే!. చెపాక్‌లో స్టీవ్ స్మిత్‌కు జడేజా సంధించిన మ్యాజిక్ బాల్‌తో మొదలైన ఈ మాయ.. ఈడెన్‌గార్డెన్స్‌లో సఫారీతో మ్యాచ్‌లోనూ కొనసాగింది. అదే తరహా బంతిని కోల్‌కతలో తెంబ బవుమాకు విసిరిన జడేజా సఫారీ సారథినీ షాక్‌లోకి నెట్టాడు. మహ్మద్ రిజ్వాన్‌కు ఆఫ్ కట్టర్, షాదాబ్ ఖాన్‌కు రివర్స్ స్వింగర్ వేసిన బుమ్రా పాక్ బ్యాటర్లను విస్మయానికి గురిచేశాడు. శ్రీలంక ఓపెనర్ నిశాంకను బుమ్రా బురిడీ కొట్టించిన తీరు సైతం సూపర్. దిమిత్ కరుణరత్నెను సిరాజ్ సైతం అదే రీతిలో బోల్తా కొట్టించాడు. ఊహించిన బంతే పడినట్టు తొలుత బ్యాటర్ భావించినా.. రెప్పపాటులో అంతా రివర్స్‌లో జరిగిపోతుంది. నమ్మశక్యంగా లేదంటూ తల అడ్డంగా ఊపుతూ పెవిలియన్‌కు చేరటం తప్ప ఇక చేయడానికి ఏమీ ఉండదు. ఇక ఎంజెలో మాథ్యూస్‌కు షమి సంధించిన క్లాసిక్ స్వింగ్ బాల్స్ అసమానం. జోశ్ బట్లర్‌కు కుల్దీప్ యాదవ్.. బెన్ స్టోక్స్ కోసం షమి వేసిన సీక్వెన్స్ ఆఫ్ బాల్స్.. వర్ణించడానికి పదాలు సరిపోవేమో!
గాయమే.. వరం!
ప్రపంచకప్ గ్రూప్ దశ తొలి నాలుగు మ్యాచుల్లో టీమ్ ఇండియా బౌలింగ్ విలక్షణంగా కనిపించింది. మ్యాచ్‌లో ఏ దశలోనైనా వికెట్లు పడగొట్టగల బౌలింగ్ విభాగంగా పేరు తెచ్చుకుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయంతో తుది జట్టు సమీకరణం మారింది. పాండ్య లోటు భర్తీ చేసేందుకు ఓ స్పెషలిస్ట్ బ్యాటర్, ఓ స్పెషలిస్ట్ బౌలర్‌ను ఎంచుకున్నారు. ఫలితంగా బంతి అందుకున్న మహ్మద్ షమి.. నాలుగు మ్యాచుల్లో ఏకంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శన, ఓ నాలుగు వికెట్ల ప్రదర్శన ఉన్నాయి. షమి రాకతో భారత బౌలింగ్ భయానకంగా మారింది. ప్రత్యర్థి బ్యాటర్లు వికెట్లు కాపాడుకునేందుకు పాట్లు పడుతుండగా.. ఆ ప్రయత్నమూ ఎంతోసేపు విజయవంతం కావటం లేదు. స్వింగ్, సీమ్, టర్న్‌తో ముప్పేట దాడి చేస్తున్నారు. ఏ జట్టుకైనా పరుగుల వేటలో ప్రత్యేకించి ఓ బౌలర్‌ను ఎంచుకుని ఎదురుదాడి చేస్తాయి. ప్రమాదకర బౌలర్లను గౌరవించి, టార్గెట్ చేసిన బౌలర్ కోసం వేచిచూస్తాయి. కానీ ప్రస్తుత భారత బౌలింగ్ లైనప్‌లో అందరూ ప్రమాదకరమే. బుమ్రా, సిరాజ్, షమి, కుల్దీప్, జడేజాలు దడ పుట్టిస్తారు. పరుగుల వేటకు అవకాశం చిక్కక ప్రత్యర్థులు చిత్తవుతున్నారు.
గణాంకాలు అదరహో..
గణాంకాల పరంగా మనోళ్లు ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. భీకర పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమి 48 వికెట్లు పడగొట్టారు. ప్రతి 23 బంతులకు పేసర్లు ఓ వికెట్ పడగొట్టారు. సగటు 18.3. ఎకానమీ 4.8 మాత్రమే. స్పిన్ ద్వయం, మాయగాళ్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా 27 వికెట్లు కూల్చారు. ప్రతి 31 బంతులకు స్పిన్నర్లు ఓ వికెట్ పడగొట్టారు. సగటు 20.3 కాగా, ఎకానమీ 3.9. పవర్‌ప్లే (1-10 ఓవర్లు), 11-40 ఓవర్లు, డెత్ ఓవర్లు (41-50) ఇలా ప్రతి దశలోనూ మన బౌలర్ల గణాంకాలు సూపర్. వికెట్ల వేట, సగటు, స్ట్రయిక్‌రేట్, ఎకానమీ ఏ కొలమానం తీసుకున్నా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో భారత బౌలర్ల సగటు 19.03 (ప్రతి 19.03 పరుగులకు ఓ వికెట్). 26.01తో సఫారీ బౌలర్లది టోర్నీలో రెండో అత్యుత్తమ సగటు. రెండో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాతో మన బౌలర్ల వ్యత్యాసం ఏకంగా -6.99. మరే ప్రపంచకప్‌లోనూ ఇంతటి వ్యత్యాసం లేదు. 2003లో అత్యధికంగా ఆస్ట్రేలియా (18.33), భారత్ (23.56) -5.23 సాధించింది. ఇక ఎకానమీ పరంగా భారత బౌలర్లు 4.40తో ఉత్తమంగా నిలిచారు. అఫ్గనిస్థాన్ 5.27తో రెండో స్థానంలో ఉన్నారు. రెండు జట్ల మధ్య వ్యత్యాసం -0.86. 2011 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ (4.13), శ్రీలంక (4.44) మధ్య వ్యత్యాసం -0.32 తర్వాతి ఉత్తమం. ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచుల్లో బ్యాటర్లు చెమటోడ్చే పరిస్థితి రాలేదు. ఆ స్థాయిలో బౌలర్లు దుమ్మురేపారు. తొలుత బౌలింగ్ చేసినప్పుడు ఏ మ్యాచ్‌లోనూ 300 పైచిలుకు స్కోరు ఛేదించాల్సిన అవసరం రాలేదు. ఇక స్కోరు కాపాడుకునేందుకు 350 పైచిలుకు స్కోర్ల కోసం బ్యాటర్లు ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం సైతం ఏర్పడలేదు. బంతి తొలి ఇన్నింగ్స్‌లో అందుకున్నా, మంచు ప్రభావంలో రెండో ఇన్నింగ్స్‌లో పట్టుకున్నా వికెట్ల వేటలో, ఫలితంలో ఎటువంటి మార్పు లేదు. అందుకే ఈ ప్రపంచకప్‌ను భారత బౌలర్లు మరింత ప్రత్యేకం చేశారు.