కారులో ఆ స్పీడేదీ..?

Is that speed in the car..?– తొలి జాబితా వచ్చి నెల రోజులు పూర్తి
– అయినా అభ్యర్థుల్లో కానరాని జోష్‌
– అధికారిక కార్యక్రమాలు తప్ప కనిపించని పొలిటికల్‌ యాక్టివిటీ
– జాబితాలో చోటు దక్కినా బీ-ఫామ్‌ గ్యారెంటీ లేకపోవటమే కారణమంటున్న నేతలు
– ఎమ్మెల్యేల మెడకు దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలు
– అభ్యర్థుల్లో గుబులు రేపుతున్న డబుల్‌
బి.వి.యన్‌.పద్మరాజు
కారు.. సారు.. సర్కారు… మొన్నటిదాకా బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలకు ఉత్సాహాన్నీ, ఊపునూ ఇచ్చిన నినాదమిది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లలో పక్కాగా గెలవటం ద్వారా తమ పార్టీ మూడోసారి జెట్‌ స్పీడుతో దూసుకెళుతుందంటూ గులాబీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి మూణ్నెల్ల ముందుగానే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దాంతో జనం వద్దకు వెళ్లేందుకు, ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసేందుకు కావాల్సినంత సమయముందని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావించాయి. తద్వారా ప్రతిపక్షాలపై పైచేయి తమదేనని అంచనా వేశాయి. ఇది జరిగి సరిగ్గా నెల (ఆగస్టు 21న జాబితాను విడుదల చేశారు) దాటింది. కానీ ముందుగా అంచనా వేసినట్టు గులాబీ పార్టీలో మాత్రం ఆ జోష్‌ కానరావటం లేదు. ఒకవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభలు, చేరికలతో హడావుడిని సృష్టిస్తోంది. కానీ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మాత్రం సొంత అభ్యర్థుల్లో ఆశించిన స్పీడు లేక వెలవెలబోతోంది. తొలి జాబితా తర్వాత కారు సారు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తారని అందరూ అంచనా వేశారు. అందుకు భిన్నంగా ఒకట్రెండు సందర్భాల్లో తప్ప సీఎం జిల్లాలకు వెళ్లిన దాఖలాల్లేవు. అది కూడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం లాంటి ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలకే ఆయన హైదరాబాద్‌ దాటి బయటకు వెళ్లారు. మరోవైపు క్షేత్రస్థాయిలోని ఎమ్మెల్యేలు కూడా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, పింఛన్ల పంపిణీ, ఎక్స్‌గ్రేషియోలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ తదితర ప్రభుత్వ అధికారిక వేదికల మీది నుంచే రాజకీయ విమర్శలు చేయగలుగుతున్నారు తప్పితే స్పష్టంగా పొలిటికల్‌ యాక్టివిటీలో పాల్గొనకపోవటం గమనార్హం. మూణ్నెల్ల ముందే జాబితాను ప్రకటించటంతో అన్ని నెలలపాటు కార్యక్రమాల నిర్వహణ తలకు మించిన భారమవటం ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో నైరాశ్యానికి ఒక కారణమైతే… అంతకు మించిన ప్రధాన కారణం మరొకటి ఉందనే ప్రచారం బీఆర్‌ఎస్‌లో జోరుగా కొనసాగుతోంది. టిక్కెట్‌ దక్కిందని మురిసిపోతున్న వారెవ్వరికీ బీ-ఫామ్‌ వస్తుందన్న గ్యారెంటీ లేకపోవటమే అసలు సిసలు కారణమని తెలసింది. అందుకే ఇప్పటి నుంచే తొందరపడకుండా, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత, బీ-ఫామ్‌ చేతికందిన తర్వాతే ప్రచారాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
‘పథకాలతో’ పరేషాన్‌…
ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్‌… ‘జనంలో ఉండండి..’ అంటూ తాజాగా వారందరికీ వార్నింగ్‌ ఇచ్చినట్టు వినికిడి. అలా ఆయన ఆదేశాలు జారీ చేసినా అభ్యర్థులు క్షేత్రస్థాయిలోకి వెళ్లలేని పరిస్థితి. సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకం, ఎన్నికల కోసం ముందుకు తెచ్చిన బీసీ, మైనారిటీ బంధు పథకాలు వారికి మెడకు చుట్టుకుంటున్నాయి. దళిత బంధు మొదటి దశ పూర్తయిందని చెబుతోన్న ప్రభుత్వం.. ఆ పథకం రెండో దశను ప్రారంభించింది. ఎమ్మెల్యేలు లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి, పైకి పంపినా ఇంకా గ్రౌండింగ్‌ పూర్తి కాకపోవటంతో దానిపై లబ్దిదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీసీ, మైనారిటీ బంధు పథకాలకు సంబంధించి కూడా ప్రజలు ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులను నిలేస్తున్నారు. వీటికి లబ్దిదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటంతో బడ్జెట్‌ ఏ మూలకూ సరిపోవటం లేదు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీంతోపాటు ప్రతిష్టాత్మకమైన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ నత్త నడక నడుస్తోంది. ఒక్క జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలోనే లక్షల్లో దరఖాస్తులొస్తే… వేలల్లో మాత్రమే ఇండ్ల పంపిణీ కొనసాగుతోంది. దీంతో ఇండ్లు దక్కని పేదలు ఎమ్మెల్యేలను నిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సర్దిచెప్పుకోలేక వారు తలలు పట్టుకుంటున్నారు. అందుకే జనం వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు.
అప్పుడలా.. ఇప్పు’డీలా…’
ఈ పరిణామాలన్నింటి రీత్యా గులాబీ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. 2018లో ఒక ఏడాది ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ బాస్‌…ఆ క్రమంలో పార్టీలో, క్యాడర్‌లో జోష్‌ను పెంచి, రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ముందస్తుకు వెళ్లకుండా నిర్ణీత సమయంలోనే ఎన్నికలకు వెళుతూ… మూణ్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించినా అప్పటి హుషారు ఇప్పుడు ఆ పార్టీలో, కార్యకర్తల్లో కానరాకపోవటం గమనార్హం.