నిందితులను కఠినంగా శిక్షించాలి

– విచారణ వేగవంతం చేయాలి
– కోదాడ-జడ్చర్ల రహదారిపై రాస్తారోకో
– పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం
– ఉద్రిక్తకంగా మారిన ఆందోళన
నవతెలంగాణ-మిర్యాలగూడ
గత నెల 27న వైష్ణవి అపార్ట్‌ మెంట్‌ భవనంపై నుంచి పడి శోభారాణి అనే యువతి మృతి కేసులో విచారణ వేగవంతం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం బాధిత కుటుంబ సభ్యులు, కాలనీ ప్రజలు ఆందోళన చేశారు. కోదాడ- జడ్చర్ల రహదారిపై సుమారు గంట పాటు బైఠాయించి రాస్తారోకో చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది. మృతురాలి తల్లి దండగల అలివేలు సోదరుడు కార్తీక్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నివారించారు. ఆందోళన విరమించేందుకు వన్‌ టౌన్‌, టూ టౌన్‌, రూరల్‌ పోలీసులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పిన ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వైష్ణవి అపార్ట్‌మెంట్లో 16 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటి సీసీ పుటేజీలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. తమ కూతురు మృతి పై అనుమానాలు ఉన్నాయని కొందరి పేర్లు ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. సంఘటన జరిగి ఆరు రోజులు అవుతున్న నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. నిందితులను గుర్తించడంలో పోలీసుల జాప్యం చేస్తున్నారని, కేసు నుండి కొందరిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్‌ కాల్స్‌, సిసి ఫుటేజిలను సమగ్రంగా పరిశీలించి మృతికి కార్మికులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలిసిన డీఎస్పీ వెంకటగిరి అక్కడకి చేరుకొని శోభరాణి మృతిపై ముమ్మర విచారణ సాగుతుందని త్వరలోనే నిందితులని గుర్తిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ధర్నాతో ట్రాఫిక్‌ జాం ఏర్పడగా పోలీసులు వాహనాలను దారి మల్లించారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాఘవేందర్‌, నరసింహారావు సత్యనారాయణ ఎస్సైలు సుధీర్‌కుమార్‌, కష్ణయ్య, నరసింహులు తదితరులు ఉన్నారు.