ధాన్యం దించుకుంటేనే కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుంది: జిల్లా అదనపు కలెక్టర్

నవతెలంగాణ – భిక్కనూర్
రైస్ మిల్లులలో త్వరగా ధాన్యం దించుకుంటేనే కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ రైస్ మిల్లర్లకు సూచించారు. శుక్రవారం మండలంలో ఉన్న సిద్ధ రామేశ్వర రైస్ మిల్, సప్తగిరి రైస్ మిల్ యజమానులకు ప్రతిరోజు 10 నుండి 15 లారీల ధాన్యం దించుకోవాలని, మిల్లులలో లారీలు వేచి ఉంచకుండా తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపించాలని తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియ లో మరో 18 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడంతో ముగుస్తుందని, శుక్రవారం ఒక్కరోజు 208 లారీలు సమకూర్చి కొనుగోలు కేంద్ర ద్వారా 512 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరిగిందన్నారు. పెద్ద మల్లారెడ్డి, దోమకొండ మండలంలోని ముత్యంపేటలో ఉన్న రైస్ మిల్లులను పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందంతో కలిసి పరిశీలించారు. దోమకొండ, భిక్కనూర్, బిబిపేట్, సదాశివ నగర్, కామారెడ్డి మండలాలలో దాన్యం ఉందని కేంద్రాల నిర్వహకులు, హమాలీల సహకారంతో తెల్లవారుజామునుండే ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించడం జరుగుతుందని, మరో నాలుగు రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.