నవతెలంగాణ- తాడ్వాయి
ప్రజావాణిలో వచ్చిన వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి 93 వినతులు జెడ్పి సీఈఓ సాయ గౌడ్ తో కలిసి స్వీకరించారు. ఇందులో ప్రధానంగా భూ సమస్యలు,ధరణి, భూ తగాదాలకు సంబంధించి 56 వినతులు రాగా, మునిసిపాలిటీలలో వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం 8 వినతులు వచ్చాయి. . కాగా పొలిసు శాఖకు సంబంధించి 6, డిఆర్ డిఓ-8, ఆబ్కారీ శాఖకు-3, వ్యవసాయ,మహిళా శిశు సంక్షేమం, పంచాయత్ రాజ్ విభాగానికి సంబంధించి రెండేసి వినతుల చొప్పున వచ్చాయి. పౌర సరఫరాలు, విద్య, మిషన్ భగీరథ, బిసి, ఎస్సి, పశు సంవర్ధక , ఖజానా శాఖలకు సంబంధించి ఒక్కో వినతి చొప్పున వచ్చాయి. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ భూ సమస్యలు, ధరణికి సంబంధించి ఎక్కువగా వినతులు వస్తున్నాయని, తహసీల్ధార్లు సాధ్యమైనంత వరకు తమ స్థాయిలో పరిష్కరించాలని, లేదా పరిష్కార మార్గాలు చూపాలని, అన్నారు. ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో వస్తున్న వినతులను సంబంధిత అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించిన అనంతరం ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. మసూద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.