రానున్నది రోబోట్లు, కోబోట్ల యుగం!

 The era of robots and cobots is coming!ఒక నాడు కంప్యూటర్ల ప్రవేశం, వినియోగం గురించి అనుకూల వ్యతిరేక వాదనలు జరిగినట్లుగానే ఇప్పుడు ప్రపంచంలో రోబోట్లు, కోబోట్ల గురించి మాట్లాడుతున్నారు. మానవులతో పని లేకుండా ప్రోగ్రామ్‌ చేసి వదిలితే వాటంతట అవే పని చేసేవి రోబోట్లు, మనుషులు పని చేయించేవి కోబోట్లు. రెండూ ఉత్పత్తిని పెంచేవే. ఎవరు వద్దన్నా కద్దన్నా వచ్చే రోజులు వాటివే. అంతర్జాతీయ రోబోటిక్స్‌ ఫెడరేషన్‌ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం చైనా పెద్ద మొత్తంలో రోబోట్ల మీద పెట్టుబడి పెడుతోంది. ప్రతి పదివేల మంది కార్మికులకు అక్కడ ప్రస్తుతం 322 రోబోట్లు ఉన్నాయి. దీన్ని రోబోట్ల సాంద్రతగా పరిగణిస్తున్నారు. ఉత్పాదక రంగ పరిశ్రమల్లో 2021 సమాచారం ప్రకారం ప్రపంచ సగటు 141రోబోలు ఉన్నాయి. దేశాల వారీగా దక్షిణ కొరియా 1,000, సింగపూర్‌ 670, జపాన్‌ 399, జర్మనీ 397, చైనా 322, స్వీడన్‌ 321, చైనీస్‌ హాంకాంగ్‌ 304, చైనీస్‌ తైవాన్‌ 276, అమెరికా 274, స్లోవేనియా 249తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. గతంలో వ్యవసాయం నుంచి పరిశ్రమలకు మారినప్పుడు, 1980వ దశకంలో వచ్చిన కంప్యూటర్ల తరువాత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉపాధి దొరికినట్లే రోబోలు వచ్చినా కొత్త అవకాశాలు వస్తాయని సమర్దకులు చెబుతున్నారు. కార్మికుల స్థానంలో గతంలో యంత్రాలు వచ్చినా వాటిని నడిపేందుకు కార్మికులు కావాల్సి వచ్చింది. ఇప్పుడు రోబోలకు ఎవరితోనూ అవసరం ఉండదు. అందువలన అంత తేలిక కాదు అంటున్నారు మరికొందరు.
ప్రపంచ పరిణామాలను చూస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో భారీ పరిశ్రమలను నిర్వహించేవారు లాభాలు ఎక్కువగా ఉంటాయి గనుక రోబోట్ల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. చిన్న సంస్థలు కోబోటిక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరింత ఆధునిక రోబోలను రూపొందించేందుకు పరిశోధన- అభివృద్ధికి దేశాలూ, సంస్థలు కూడా భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. రోబో రంగంలో ప్రపంచ అగ్రగామిగా మారే లక్ష్యంతో చైనా 2021 డిసెంబరు 21న పద్నాలుగవ పంచవర్ష ప్రణాళికను ప్రకటించింది. ఐదు సంవత్సరాల్లో ఎనిమిది కీలక పరిశ్రమలను రోబోట్లతో నింపాలని పేర్కొన్నారు.”తెలివైన రోబో”ను ఆవిష్కరించేందుకు 2022 ఏప్రిల్‌ 23న 4.35కోట్ల డాలర్లతో పరిశోధనకు శ్రీకారం చుట్టారు. 2018లో ప్రపంచంలో చైనా 20వ స్థానంలో ఉండగా మూడు సంవత్సరాల్లో ఐదవ స్థానానికి ఎదిగింది. నూతన రోబోట్‌ వ్యూహం పేరుతో జపాన్‌ 93కోట్ల డాలర్లతో నూతన ఆవిష్కరణలతో తమ దేశాన్ని ప్రపంచ రోబో హబ్‌గా మార్చేందుకు పూనుకుంది. స్వంతంగా వాహనాలను నడిపే రోబోలతో సహా ఇతర ఆధునిక ఆవిష్కరణలకు నిధులు వెచ్చిస్తున్నది. పారిశ్రామిక రోబోల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జపాన్‌ 2021లో ప్రపంచానికి 45శాతం సరఫరా చేసింది.
నాలుగవతరం పారిశ్రామిక విప్లవానికి అవసరమైన రోబోలను అందించేందుకు దక్షిణ కొరియా 2022వ సంవత్సరానికే 17.25కోట్ల డాలర్లను కేటాయించింది. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు 2021 నుంచి 2027వరకు 9.43 కోట్ల డాలర్లను ఐరోపా సమాఖ్య వెచ్చించనుంది. 2021-22లో రోబో సంబంధిత కార్యక్రమానికి 19.85కోట్ల డాలర్లను కేటాయించింది. హైటెక్‌ వ్యూహం 2025 పేరుతో జర్మనీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఏటా 6.9కోట్ల డాలర్లను 2026 వరకు ఖర్చు చేస్తుంది. జాతీయ రోబోటిక్‌ చొరవ(ఎన్‌ఆర్‌ఐ 3.0) పేరుతో అమెరికా కూడా 2021లో 1.4కోట్ల డాలర్లతో నవీకరణకు పూనుకుంది. అంతరిక్షంలో పరిశోధనలకు అవసరమైన రోబోలను రూపొందించటం కూడా దీనిలో ఉంది. రోబో సాంద్రతలో వెనుకబడ కూడదని అది భావిస్తున్నది.
రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి, అంతరిక్షం, వైద్యం మొదలు అనేక రంగాల్లో ముందుండేందుకు ప్రపంచ దేశాలన్నీ పరుగులు పెడుతున్నాయి. కృత్రిమ మేథలో ఎవరికి వారు పైచేయి సాధించాలని చూస్తున్నారు. వైద్యం వంటి రంగాలలో రోబోలతో మరింత మెరుగైన సేవలను అందించవచ్చుగానీ పారిశ్రామిక రంగంలో వీటి ప్రవేశంతో వేతనాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుతుందనే అభిప్రాయాలతో పాటు దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేవారు కూడా ఉన్నారు. చైనాలో జరిగిన పరిశోధనలో పారిశ్రామిక రోబోలు ప్రతికూల ప్రభావం చూపుతాయని తేలిందని కొందరు ఉటంకిస్తున్నారు. 2016లో ప్రచురితమైన ఒక పత్రం ప్రకారం యాంత్రీకరణ వలన 77శాతం మంది ఉపాధికి గండిపడుతుందని పేర్కొన్నారు. దానికి ఫాక్స్‌కాన్‌ కంపెనీని ఉదహరించారు. 2020నాటికి 30శాతం ఆటోమేషన్‌ చేసేందుకు గాను 2012-16 సంవత్సరాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను రోబోలతో నింపారు. అన్నింటా అదే జరుగుతుందని చెప్పలేం. గంటలవారీ చెల్లించే వేతనాలు తొమ్మిదిశాతం తగ్గినట్లు కూడా తేలింది. కార్మికుల పని గంటలు కూడా పెరిగాయి. మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ 2017లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో ఐదో వంతు అంటే 80కోట్ల ఉద్యోగాలు రద్దుకానున్నట్లు అంచనా వేశారు. నలభై ఆరు దేశాల్లోని పరిస్థితిని విశ్లేషించారు. ధనిక దేశాల్లో యాంత్రీకరణ మరింత ఎక్కువగా ఉంటుంది కనుక నిధులు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, పేద దేశాల దగ్గర డబ్బు ఉండదు కనుక వాటి మీద ప్రభావం తక్కువేనని కూడా పేర్కొన్నది. యాంత్రీకరణతో మెషిన్‌ ఆపరేటర్లు, ఆహార కార్మికులు, ఆఫీసు సిబ్బంది, అకౌంటెంట్లు ఎక్కువగా ప్రభావితులవుతారు. భారత్‌లో తొమ్మిదిశాతం ఉద్యోగాలను నూతన సాంకేతిక యంత్రాలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది. వైద్యులు, లాయర్లు, బార్లలో పనిచేసే వారు, తక్కువ వేతనాలతో పనిచేసే గార్డెనర్లు, ప్లంబర్లు, సంరక్షణ సిబ్బంది మీద పెద్దగా ప్రభావం ఉండదు. తక్కువ చదువుకున్నవారికి ఉపాధి తగ్గుతుంది, అభివృద్ధి చెందిన దేశాలలో విశ్వవిద్యాలయాల చదువు అవసరాలు పెరుగుతాయి. అమెరికాలో 2030 నాటికి 3.9 నుంచి 7.3కోట్ల వరకు ఉద్యోగాలు రద్దవుతాయని, ఉపాధి కోల్పోయే రెండు కోట్ల మందిని ఇతర పరిశ్రమల్లోకి సర్దుబాటు చేయవచ్చని, బ్రిటన్‌లో 20శాతం ఉద్యోగాలను రోబోలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది.
అమెరికాలో రోబోల ప్రవేశం గురించి జరిగిన పరిశోధనలో ప్రతి 1000మంది కార్మికులకు ఒక రోబోను ఏర్పాటు చేస్తే 0.42శాతం వేతనాలు తగ్గుతాయని, ఉపాధి జనాభా దామాషాలో 0.2శాతం తగ్గుతుందని అంచనా వేశారు. ప్రదేశాలను బట్టి ఇవి మారతాయి. మరొక రోబోను తోడు చేస్తే ఆరుగురికి ఉపాధి ఉండదు. వెల్డింగ్‌, పెయింటింగ్‌, పాకింగ్‌ వంటి వాటిని పూర్తిగా ఆటోమేషన్‌ చేయవచ్చు. 1993-2007 కాలంలో అమెరికాలో పారిశ్రామిక రోబోట్లు నాలుగు రెట్లు పెరిగాయి. యాంత్రీకరణ కంటే ఇవి ఎక్కువ మంది ఉపాధి పోగొట్టినట్లు తేలింది. ఆటోమోటివ్‌ పరిశ్రమలో ఎక్కువగా రోబోట్లు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్‌లో 15, కెమికల్స్‌లో 10శాతం రోబోట్లను పెట్టగా ఆటోపరిశ్రమలో 38శాతం ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో కార్పొరేట్ల లాభాల ప్రాతిపదికనే రోబోలను ఏర్పాటు చేస్తే చైనాలో ఎందుకు వేగంగా ప్రవేశపెడుతున్నారనే ప్రశ్న తలెత్తవచ్చు. అమెరికా, ఐరోపా ధనిక దేశాల్లో జనాభా తక్కువ, ఉత్పత్తి ఎక్కువ గనుక లాభాల కోసం చేస్తే చైనాలో 140కోట్ల జనాభా వినియోగం కోసం ఉత్పత్తి, సేవలను ఎంతగానో పెంచాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ దేశాల్లో లాభం కొన్ని సంస్థల చేతుల్లో చేరుతుంది, చైనాలో ఎక్కువ భాగం సమాజపరం అవుతుంది. ఐరోపా, జపాన్‌ మాదిరి చైనాలో సగటు జీవిత కాలం పెరగటం, పిల్లల్ని కనటం తగ్గింది కనుక రానున్న కాలంలో కార్మికులకు కొరత ఏర్పడనుందని అక్కడి నిపుణులు అంచనా వేశారు. ఆ పరిణామం పశ్చిమ ఐరోపా దేశాల్లో చూస్తున్నదే. ఈ కారణంగా కూడా చైనా రోబోట్లను ప్రవేశపెడుతున్నది. చైనాలో గత దశాబ్దిలో 50లక్షల జనాభా తగ్గింది. సామర్ధ్యపెంపుదలకు, డ్రైవర్లతో పని లేని కార్లు, రోబోలతో నడిచే గోదాముల వంటి వాటి ఏర్పాటుకు అనేక పరిశోధనలు చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం ఫైనాన్సియల్‌ రంగంలో పని చేసే ఒక కార్మికుడి ఉత్పాదకత ఐరోపాతో పోల్చితే చైనాలో 20శాతం ఉంది. తరువాత 40, 50 శాతం వరకు పెరిగినప్పటికీ ఇంకా చాలా తేడా ఉంది. అందువలన వాటితో పోటీ పడాలంటే తగిన మార్పులు అవసరం అని భావిస్తున్నారు. మన దేశంలో కారు డ్రైవర్లకు తక్కువ వేతనాలకు దొరుకుతున్నారు గానీ ఐరోపాలో, అమెరికాలో అలా దొరకరు. అందుకే డ్రైవర్లతో పనిలేని కార్ల గురించి పరిశోధనకు తెరతీశారు. రోబో, యాంత్రీకరణ కారణంగా చైనాలో 2018-30 మధ్య 30శాతం మంది కార్మికులు ఒక పని నుంచి మరొకదానికి మారాల్సి ఉంటుందని మెకెన్సీ సంస్థ అంచనా వేసింది. ఇది అక్కడి ప్రభుత్వం, పౌరులకూ పెద్ద సవాలే అనటంలో సందేహం లేదు. దాన్ని అధిగమించేందుకు చైనా సన్నద్దం అవుతున్నది.
చైనాలో రోబోట్ల ప్రవేశం వలన కలిగే ప్రతికూల పర్యవసానాలు రానున్న రెండు దశాబ్దాల్లో కనిపిస్తాయని కొందరు చెబుతున్నారు. కృత్రిమ మేథ, రోబోట్ల వలన రెండు దశాబ్దాల్లో 26శాతం మంది వేరే ఉపాధి చూసుకోవాల్సి ఉంటుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అంచనా వేసింది. దీనికీ మెకెన్సీ అంచనాకు చాలా తేడా ఉంది. కొన్ని పోవటం, కొత్త ఉపాధి రావటం ఏతా వాతా వచ్చే రెండు దశాబ్దాల్లో నికరంగా పన్నెండు శాతం ఉపాధి పెరుగుతుందని కూడా ప్రైస్‌వాటర్‌ చెప్పింది. 2017-37 మధ్య సేవారంగంలో 9.7కోట్లు, నిర్మాణ రంగంలో 1.4కోట్లు, పరిశ్రమల్లో 40లక్షల మందికి ఉపాధి పెరిగితే వ్యవసాయంలో 2.2కోట్లు తగ్గితే మొత్తంగా 9.3కోట్లు పెరుగుతాయని అంచనా వేసింది. అక్కడ ఉన్నది ప్రజానుకూల సోషలిస్టు ప్రభుత్వం గనుక వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన సర్దుబాటు చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా దానికంతటికి అదే జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు. ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించిన చైనా గత చరిత్రను బట్టి ఇలా చెప్పవచ్చు. జనానికి పని కల్పించి ఉత్పత్తి పెంచి ఎగుమతులు చేసి ఎంతో ప్రగతి సాధించిన చైనాలో మాదిరి ఇతర దేశాల్లో కార్మికుల వేతనాలు పెరగలేదు. ఒకనాడు తక్కువగా ఉన్న కారణంగా అనేక దేశాలు తమ పెట్టుబడులతో అక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేతనాలు పెంచిన కారణంగా ఆశించిన మేర లాభాలు రావటం లేదని కొన్ని సంస్థలు అక్కడి నుంచి వెనక్కు పోతున్నాయి. ఎగుమతుల మీద ఎల్లకాలం ఆధారపడటం సాధ్యం కాదని గ్రహించిన కారణంగానే తమ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకు వేతన పెంపుదల వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. నూతన ఆవిష్కరణలతో ఉత్పత్తి పెరిగితే ఆ మేరకు మానవ శ్రమ పని గంటలతను తగ్గించి అందరికీ ఉపాధి కల్పించటం, సంపదల పంపిణీతో జనం అవసరాలను తీర్చటం వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందువలన ఈ నూతన సవాలును ప్రజల పట్ల బాధ్యత కలిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ అధిగమించటం ఖాయం, అయితే ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరం, ఇదే సమస్యను ఎదుర్కొనే పెట్టుబడిదారీ దేశాలు ఎలా పని చేసేది చూడాల్సి ఉంది.
సెల్‌:8331013288
ఎం. కోటేశ్వరరావు