డిజైన్లు మారుస్తూ ఏజెన్సీ గొంతెండబెడుతున్నారు

డిజైన్లు మారుస్తూ ఏజెన్సీ గొంతెండబెడుతున్నారు– సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్‌ చేయాలి
– అఖిలపక్షం ఆధ్వర్యంలో పొంగులేటికి వినతి
– సమస్య సీఎం దృష్టికి తీసుకెళ్తా : మంత్రి హామీ
నవతెలంగాణ-ఇల్లందు
గత, ప్రస్తుత పాలకులు స్వార్థపూరిత ఆలోచనలతో ప్రాజెక్టు డిజైన్లను మార్పులు చేస్తూ ఏజెన్సీ ప్రాంత గొంతు నొక్కుతూ చుక్క నీరు రాకుండా చేస్తున్నరని నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం భద్రాచలం ప్రవాహ ప్రమాద హెచ్చరికలను పరిశీలించటానికి వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గానికి జరుగుతున్న నష్టాన్ని ఏకరు పెట్టారు. ఏజెన్సీ తలాఫున ప్రవహించే గోదావరి నదీ జలాలు ఏజెన్సీ ప్రాంత సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, దానివల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్యామలమవుతుందని గత పాలకుల చేసిన డిజైన్‌ మార్పుల వల్ల ఇల్లెందు నియోజకవర్గానికి ఏజెన్సీ ప్రాంతానికి చుక్క సాగు నీరు వచ్చే పరిస్థితి లేదని, ఏజెన్సీ రైతాంగం ఏం పాపం చేశారని పాలకులు వివక్షత చూపిస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు.
సీతారాం ప్రాజెక్టు కింద పేర్కొన్న ఆయకట్టలో మూడింట రెండువంతులు పాత ఆయకట్ట స్థితికరణకే కెటాయించారు. మొత్తం 674,387 ఎకరాల సాగు ప్రతిపాదనతో డిజైన్‌ చేసిన ఈ ప్రాజెక్టు ఆయకట్టలో 4,60,000 ఎకరాలు ప్రస్తుత ఖమ్మం జిల్లా పరిధిలోనివే. మిగత 3,24,387 ఎకరాలు పాత ఆయకట్ట స్టిరీకరణ కోసమే డిజైన్‌ చేశారు. క్రమక్రమంగా మారుతూ వస్తున్న డిజైన్లపై అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ పాలకులు ఏమి పట్టించుకోకుండాతాఫిగా పనులు నడిపిస్తూ ఏజెన్సీప్రాంత రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారు. గోదావరినది జాలాలను కృష్ణానది ఆయకట్ట గ్యారెంటీ కోసం తీసుకెళ్లడం కంటేముందు ఇల్లందు నియోజకవర్గప్రాంతనికి సాగునీరు అవసరాలు తీర్చాలని ఆ తరువాతే బయటి ప్రాంతాలకి తీసుకెళ్లాలని ఏజెన్సీ రైతాంగం ప్రతిఘటిస్తుందని తెలిపారు.
సమస్య సీఎం దృష్టికి తీసుకెళ్తా : మంత్రి హామీ
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్య రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ శాసనసభ్యులు, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు గుమ్మడి నరసయ్య, సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపూరి బ్రహ్మం, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌ఏ నబీ, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, టీడీపీ నాయకులు నూతల పాటి వెంకటేశ్వర్లు, సీపీఐ పట్టణ కార్యదర్శి బంధం నాగయ్య, ఎంఎల్‌ మాస్‌ లైన్‌ పట్టణ కార్యదర్శి యాకుబ్‌ షావలి తదితరులు పాల్గొన్నారు.