– ఒక్క కమ్యూనిస్టు వందమందితో సమానం
– కొత్తకోట ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు
నవతెలంగాణ-జహీరాబాద్
తెలంగాణ అసెంబ్లీలో పేదల సమస్యల పరిష్కారం పై గొంతు విప్పేందుకు ఒక్క కమ్యూనిస్టు శాసనసభ్యుడిగా తన వంతు కషి చేస్తానని కొత్తకోట శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని భారత్ నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సన్మాన సభ, జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మతతత్వ బీజేపీని, అహంకార కేసీఆర్ పాలనను గద్దె దించడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో విజయం సాధించామని.. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి బీజేపీని గద్దెకించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కమ్యూనిస్టులు బలపరిచిన అభ్యర్థులని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొట్టి వారి ఓట్లను దండుకోవడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తున్నదన్నారు. బీజేపీ మైనార్టీ సెల్ విభాగంగా రాష్ట్రంలో ఎంఐఎం పనిచేస్తున్నదని దుయ్యబట్టారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తున్నారన్నారు. మతం కేవలం ఇంటి గడపకే పరిమితం అవ్వాలని.. బయటికి వచ్చిన అనంతరం అందరు సమానం సమానంగానే భావించాలనేది తమ లక్ష్యమన్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేదుకు మాత్రమే బిజెపి రామ మందిర ఎజెండాను తీసుకువచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నదన్నారు. కాబట్టి ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకులు ఈటి నరసింహ, వి ప్రకాష్‌రావు, జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ మాట్లాడుతూ.. దేశంలో ఎంతోమంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఏది ఏమైనా నిరుపేదల సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటికే ఎంతోమంది నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత కమ్యూనిస్టులకే దక్కుతుందన్నారు. అనంతరం సాంబశివరావును జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, పూజ, సిమా, అశ్వక్, మొయ్యద్దీన్, జహంగీర్, ఖాజామీయా తదితరులు పాల్గొన్నారు.