డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం

– మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
– సిఐ రాజశేఖర్ రెడ్డి 
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : డ్రగ్స్ రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవన్ ఆదేశానుసారం పనిచేయడం జరుగుతుందని, మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు, విద్యార్థులు, యువత ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచించారు. మాదకద్రవ్యాలపై  బుధవారం జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకు,  కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో  మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత, విద్యార్థులు దొంగతనాలకు, దోపిడీలకు, మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడి ఎంతోమంది విద్యార్థులు, యువకులు తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. యుక్త వయసులో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితాంతం అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఎవరైనా డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలకు అలవాటైన,  సప్లై చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇచ్చి సమాజాన్ని, తమ కుటుంబాలను డ్రగ్స్, మాదక ద్రవ్యాల దగ్గర నుండి దూరంగా ఉంచాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించే కిట్లు అందుబాటులోకి రావడం జరిగిందని తెలిపారు.డ్రగ్స్ నిర్మూలనపై సెమినార్లు ఎంతగానో ఉపయోగపడతాయని, నల్లగొండ జిల్లా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు లేని జిల్లాగా చూడడమే ఎస్పీ, డిఎస్పీ  ఏకైక లక్ష్యమని అందుకు విద్యార్థులు, యువకులు, మేధావులు, విద్యావంతులు, తమ వంతు సహాయ సహకారాలు అందించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ శంకర్, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్, మల్లం మహేష్, ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి, బాయ్స్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఎన్సిసి లెక్చరర్ జిల్లా నర్సింహ్మా , ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కమిటీ సభ్యురాలు స్పందన, సంపత్,  హర్షవర్ధన్, యశ్వంత్, ‌నిశ్వంత్,  ప్రశాంత్,నర్మద తదితరులు పాల్గొన్నారు.