మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం– అడిషనల్‌ కమిషనర్‌ చంద్రకాంత్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళా శక్తి పథకం ద్వారా వచ్చే ఐదు సంవత్స రాలలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అడిషనల్‌ కమిషనర్‌ చంద్రకాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్‌ హాల్లో యూసీడి ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు, టీఎల్‌ఎఫ్‌ లీడర్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో యూసీడీ జాయింట్‌ కమిషనర్‌, పరిశ్రమల శాఖ జేడీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ అధికారులు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల ఎల్‌ డీఎంలు, మెప్మా స్టేట్‌ మిషన్‌ నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూసీడీ అడిషనల్‌ కమిషనర్‌ చంద్రకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్స్‌, క్యాటరింగ్‌ యూనిట్స్‌, తెలంగాణా పిండి వంటలు, బొటిక్స్‌, పిండి గిర్ని, డీటీపీ జిరాక్స్‌ సెంటర్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ యూనిట్స్‌ తదితరాలు ఏర్పాటు చేసుకునేలా ఎస్‌.హెచ్‌.జీ మహిళలకు అవగాహన కల్పించి పథకం అమలు చేయడంలో ఆయా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. టీఎల్‌.ఎఫ్‌, ఎస్‌.ఎల్‌.ఎఫ్‌ సమావేశాలను రెండు రోజులలోగా పూర్తి చేసి ఎస్‌హెచ్‌జి మహిళలకు సమగ్రంగా అవగాహన కల్పించాలని సూచించారు. మేజర్‌ గ్రూప్‌ ఎంటర్ప్రైజెస్‌గా క్యాంటీన్స్‌, ఫుడ్‌ ట్రాక్స్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ ,క్యాటరింగ్‌ సర్వీసెస్‌, మీసేవ సెంటర్స్‌, కన్స్ట్రక్షన్‌ ఎక్విప్మెంట్‌ తదితరాలను ఏర్పాటు చేసుకో వచ్చని తెలిపారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్‌ఎం)ఈ కింద వ్యక్తిగత మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ నెలకొల్పుటకు అందిస్తున్న రుణం, రాయితీ, ఆహార తయారీ రంగంలో ఉన్న ఎస్‌.హెచ్‌.జి సభ్యులకు అందిస్తున్న రుణం, నిబంధనల గురించి రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ప్రతినిధి శ్రీరామ్‌ వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏఏ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేయవచ్చో గుర్తించాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను వివరించారు. ఈ కార్యక్రమంలో యూసీడీ ప్రాజెక్ట్‌ జాయింట్‌ కమిషనర్‌ వెంకటరెడ్డి, పీ.డీి సౌజన్య రంగా రెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కజిగిరి జిల్లా ల లీడ్‌ బ్యాంక్‌ అధికారులు, టౌన్‌, స్లామ్‌ లెవెల్‌ స్థా యి మహిళ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.