– ఏఐఎఫ్‌ఈఈ జాతీయ సదస్సులో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో విద్యుత్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థల పరిరక్షణే లక్ష్యంగా భవిష్యత్ క కార్యాచరణ ఉండాలని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ (ఏఐఎఫ్‌ఈఈ) 16వ జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి, అమర్‌జిత్ కౌర్, ఏఐఎఫ్‌ఈఈ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ శర్మ, అధ్యక్షులు సద్రుద్దీన్ రానా, నేపాల్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు రామేశ్వర్ పీ పాండిల్, జాతీయ కార్యదర్శి కృష్ణ భుయాన్, జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ పద్మారెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వీ వెంకటేశ్వర్లు, జీసాయిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీర్, అడిషనల్ సెక్రటరీ వరప్రసాద్, యూనియన్ గౌరవ సలహాదారులు జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పలు తీర్మానాలు చేసినట్టు వక్తలు తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రయివేటీకరణ ఆపాలనీ, విద్యుత్ సవరణ బిల్లు-2022 ఉపసంహరించుకోవాలనీ, ప్రజా వ్యతిరేక సంస్కరణలను నిలిపేయాలనీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ తీర్మానాలు చేసినట్టు తెలిపారు. ధరల పెరుగుదల, ఉత్తర ప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తదితర తీర్మానాలు కూడా చేశామన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
ఈ సందర్భంగా జాతీయ సంఘానికి నూతన కమిటీని 26 మందితో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎస్ మూర్తి (తమిళనాడు), ప్రధాన కార్యదర్శిగా మోహన్ శర్మ (మహారాష్ట్ర), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షమీఉల్లా (కర్ణాటక), ఉపాధ్యక్షులుగా వేమునూరి వెంకటేశ్వర్లు (తెలంగాణ), ఉప ప్రధాన కార్యదర్శిగా జి.సాయిబాబు (తెలంగాణ) ఎన్నికయ్యారు.