– ప్రభుత్వ పాఠశాల్లో మార్షల్ ఆర్ట్స్
– మూడు నెలల పాటు శిక్షణ
– జిల్లాలో 1634 పాఠశాలల్లో అమలయ్యే అవకాశం
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ప్రస్తుతం సమాజంలో పాఠశాల విద్యలో విద్యార్థినులపై అఘాయిత్యాలు పెరుగుతన్నాయి. ఈ క్రమంలో వాటిని నివారించే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ డిఫెన్స్ ‘ఝాన్సీ లక్ష్మీబాయి స్కీం’ ద్వారా విద్యార్థులకు మూడు నెలల పాటు కరాటే శిక్షణ ఇచ్చే విధంగా చేస్తున్నారు. దీంతో బాలికలపై జరుగుతున్న లైంగికదాడులు, అకాయితాల వేధింపుల నుంచి రక్షణగా ఉంటుందని ప్రభుత్వం భవించి దీన్ని అమలు చేయనుంది. దీనితో స్వీయ రక్షణకు అవకాశం కలగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
జిల్లాలో 1634 పాఠశాలల్లో అమలు
పాఠశాలలు నివాస ప్రాంతాల్లో కాకుండా దూరంగా ఉండడంతో అక్కడికి వెళ్లే గ్రామంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించడానికి వ్యక్తిగత రక్షణ కోసం కరాటే శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 1634 వివిధ రకాల పాఠశాలలుండగా వీటిలో ప్రాథమిక పాఠశాలలు 908, ప్రాథమికోన్నత పాఠశాలలు 180, ఉన్నత పాఠశాలలు 170తో పాటు గిరిజన సంక్షేమ శాఖలో గిరిజన ప్రాథమిక పాఠశాలలు 330, ఆశ్రమ పాఠశాలలు 46 ఉన్నాయి. వీటన్నింటిలో కరాటే శిక్షణాను అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
కరాటే తరగతులతో స్వీయ రక్షణ
బాలికలకు కరాటే నేర్పడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్వీయ రక్షణ అవకాశం ఏర్పడనుంది. సెల్ఫ్ డిఫెన్స్ ‘ఝాన్సీ లక్ష్మీబాయి స్కీం’ ద్వారా విద్యార్థులకు మూడు నెలల పాటు కరాటే శిక్షణ ఇచ్చే విధంగా చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే పథకం ద్వారా కాగజ్‌నగర్ డివిజన్‌లోని చింతగూడ, పెట్రోల్ పంప్ బట్టుపల్లి, సర్ సిల్క్ ఉర్దూ మీడియం పాఠశాల, 12వ వార్డు పాఠశాలల్లో శిక్షణ ఇవ్వగా ప్రస్తుత సంవత్సరం జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
శిక్షకులకు ఉపాధి కల్పించాలి
కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా మూడు నెలల పాటు శిక్షణ ఇస్తూ దానికోసం ఏర్పాటు చేసే శిక్షకునికి నెలకు రూ.5000 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో మిగతా నెలలు ఉపాధి లేక కరాటే శిక్షకులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 12 నెలల పాటు కరాటే శిక్షకులను నియమించి, వారికి కనీస మొత్తాన్ని చెల్లిస్తే మరింత నాణ్యమైన శిక్షణ అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉపాధి అవకాశం కల్పించాలి
దేవయ్య, కరాటే శిక్షకుడు
గత సంవత్సరం నుండి జిల్లాలోని పలు పాఠశాలల్లో కరాటే తరగతులు చెబుతున్నాను. అతి తక్కువ వేతనంతో మూడు నెలలు మాత్రమే పనిచేయాల్సి వస్తుంది. 12 నెలలు కొనసాగించి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ఉత్తర్వులు వెలువడగానే శిక్షకుల నియామకం
ఉదయబాబు, మండల విద్యాధికారి
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో కరాటే శిక్షకులను నియమించుకోవాలని తెలిపింది. అయితే తుది ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రతి పాఠశాలలో కరాటే శిక్షకులను నియమించడం జరుగుతుంది. దీంతో విద్యార్థినులకు స్వీయ రక్షణ అవకాశం కలుగుతుంది.