పారిశుధ్య కార్యక్రమం ప్రణాళిక బద్ధంగా చేపట్టాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్
నవతెలంగాణ-మెదక్ టౌన్
మునిసిపల్ వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని 18వ వార్డు గాంధీ నగర్‌లో పారిశుధ్య కార్యకమాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యమన్నారు. వ్యాధులు ప్రబలకుండా వర్షాకాలానికి ముందే నేటి నుంచి 27 వరకు మునిసిపల్ ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దష్టి పెట్టి షెడ్యూల్ ప్రకారం అన్ని వార్డులలో కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మునిసిపల్ డైరెక్టర్‌కు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఆ మేరకు ప్రతి వార్డులో స్వచ్ఛత కోసం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడానికి కార్మికులకు దిశా నిర్దేశం చేయాలని మునిసిపల్ కమిషనర్‌కు సూచించారు. ప్రధానంగా మురికి నీరు సాఫీగా పారే విధంగా సైడ్ డ్రైన్స్ క్లిన్ చేసి చెత్తను తొలగించాలని, డైన్స్, రోడ్డు పక్కల ముళ్ల పొదలను తొలగించాలని, పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరచాలని, మాంసం దుకాణాల వద్ద వ్యర్థాలు తొలగించాలన్నారు. అదే విధంగా అన్ని ఇండ్లలో తడి, పొడి చెత్తను సీకరించి సేగ్రిగేషన్, షెడ్లకు తరలించాలని సూచించారు. అంతర్గత రహదారులు, ప్రధాన రహాదారులను, ప్రభుత్వ సంస్థలు, ప్రజోపయోగ సంస్థలను శుభ్రం చేయాలని, లోతట్టు ప్రదేశాలను గుర్తించి నీరు నిల్వ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, నిర్మాణాలను గుర్తించి తొలగించి ఆ ప్రాంతాన్ని చదును చేయాలని సూచించారు. అలాగే పాడుబడిన బావులను, బోర్లను పూడ్చివేయాలని అన్నారు. దోమల కారణంగా ప్రజలు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ ఫాగింగ్, సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయాలన్నారు. అనంతరం డంప్ యార్డ్‌ను సందర్శించి పాత చెత్తను బయో మైనింగ్ ద్వారా పౌడర్ చేసి అవసరమైన ఫ్యాక్టరీలకు విక్రయించాల్సిందిగా సూచించారు. తద్వారా డంప్ యార్డ్ ప్రాంతం శుభ్రమవుతుందని, అక్కడ పార్క్ ఏర్పాటు చేయడానికి అవకాశముంటుందని అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మట్టి జగపతి, మునిసిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, కౌన్సిలర్ సమియుద్దీన్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.