కాంగ్రెస్ గెలుపే లక్ష్యం

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
– అందరు కలిసి కసిరెడ్డిని గెలిపించుకుందామని పిలుపు
నవతెలంగాణ- ఆమనగల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆమనగల్ పట్టణంలోని తన ఫౌండేషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, తన అభిమానులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. అధిష్టానం ఆదేశాల మేరకు కల్వకుర్తి అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగురడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న కుటుంబానికి చెందిన తాను శక్తివంచన లేకుండా కష్టపడి అధిష్టానం ప్రకటించిన కసిరెడ్డి నారాయణరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. గత సంవత్సర కాలంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి తనతో కలిసి నడిచిన కాంగ్రెస్ టీం సభ్యులు అందరు ఇక ముందు కూడా అదేవిధంగా పనిచేసి కల్వకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తక్కువ సమయంలో కనివిని ఎరుగని రీతిలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్వలాభం మానుకొని పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగడం హర్షనీయం అన్నారు. పార్టీ బలోపేతానికి సుంకిరెడ్డి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈసమావేశంలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సుంకిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.