– రాముడి పేరుతో మోడీ రాజకీయం
– ఆదర్శనేత, మంచి కమ్యూనిస్టు బొజ్జ గాంధీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ముదిగొండ
”దేశాన్ని ఫాసిస్ట్ హిందూత్వదేశంగా మార్చేందుకు సంఫ్ పరివార్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి.. ఆ కుయుక్తులను కమ్యూనిస్టులు అడ్డుకుంటారు.. లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ కమ్యూనిస్టుల లక్ష్యం.. కమ్యూనిస్టులు లేనిదే దేశానికి భవిష్యత్ లేదు..” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలో కమలాపురం పంచాయతీ శివారి అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నేత బొజ్జ గాంధీ సంస్మరణ సభ గ్రామశాఖ కార్యదర్శి కె.కుటుంబరావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. దేశంలో లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యమన్నారు. ప్రధాని మోడీ ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
దేశ సమస్యల గురించి అడిగిన వారిపై నిర్బంధం, అరెస్టులు, కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. సామాన్య ప్రజలు, మహిళలు, రైతులు, కార్మికులు, కూలీల సమస్యలు పరిష్కరించి ఓట్లు అడగాల్సిన మోడీ రామజపం చేస్తున్నారని విమర్శించారు. అయోధ్యలో నిర్మాణం చేసిన బాల రాముని పేరుతో రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొంది మూడోసారి గద్దెనెక్కాలని బీజేపీ యోచిస్తోందన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో సీపీఐ(ఎం) భాగస్వామి ఉండి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. బొజ్జ గాంధీ ఆదర్శవంతమైన ఆలోచనతో, మంచి కమ్యూనిస్టుగా జీవించారన్నారు. బొజ్జ గాంధీ మరణం కుటుంబానికి, పార్టీకి తీరని లోటని అన్నారు. అనంతరం బొజ్జ గాంధీ స్థూపాన్ని పార్టీ శ్రేణులతో కలిసి తమ్మినేని ఆవిష్కరించారు. పుష్పగుచ్చాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. తను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నడిచిన ఆదర్శమైన కమ్యూనిస్టు నేత బొజ్జ గాంధీ అన్నారు.
పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. బొజ్జ గాంధీ ఆశయాలను మోసుకెళ్లతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, బుగ్గవీటి సరళ, జిల్లా నాయకులు బండి పద్మ, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బత్తుల వీరారెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, నాయకులు మందరపు వెంకన్న, కందిమల్ల తిరుపతి, టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, యండ్రపల్లి రవికుమార్, కోలేటి ఉపేందర్, కందుల భాస్కరరావు పాల్గొన్నారు.